ఒంపుగ తిరిగి వినసొంపుగా పలికే వీణ..  హుషారు రాగాల్ని నిటారుగా పలికించే గిటార్… వేలి కొసలు తాకగానే వేలవేల రాగాలు పలికించే హార్మోనియం.. తాళాంగు తకథిమి తాళాల్ని తన్మయత్వం చెందేలా మోగించే తబలా.. ముక్త కంఠంతో ఒకటే అంటుంటాయి. ఇళయరాజా బాణీల ఓణీలు కట్టుకొని.. ఆ స్వరమధురిమలో సరిగంగతానాలు చేయాలని.. శ్రోతల్ని ఉర్రూతలూపాలని. నిజమే .. ఇళయరాజా సంగీతానికి తలఒంచని రాగమే లేదు. ఆ రాగాలకు పులకించని గీతమే లేదు. ఆ గీతాలకు స్పందించని హృదయమే లేదు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని మహారాజులా ఏలిన సంగీత రాజా ఆయన. సంగీత దర్శకుడిగా తన 40 సంవత్సరాల జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా తన సంగీతంతో దక్షిణాది  సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన శ్రుతిలయకారుడు.

1943 జూన్ 2న తమిళనాడు రాష్ట్రంలో, తేనీ జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారుడుగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయ ప్రాంతంలో పెరగటం వల్ల పొలంలో రైతులతో కలిసి జానపద పాటలు పాడుకుంటుండేవారు. అతని 14 సంవత్సరాలప్పుడు తన సోదరులతో కలసి దక్షిణ భారత దేశంలోని అనేక గ్రామాలలో, పట్టణాలలో పావలార్ సంగీత బృందం సభ్యుడిగా పర్యటించారు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన పాటకు బాణీ కట్టారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సలీల్ చౌదరి అనే సంగీత దర్శకుడి దగ్గర గిటారుస్టగా, కీ బోర్డు కళాకారుడిగా పనిచేశారు. తరువాత కన్నడ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుడి దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడుగా పనిచేశారు. అందులో చాలావరకు కన్నడ చిత్రాలే. ఈ సమయములోనే ఆయన రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలో కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేస్తూ దానిలో ఉన్న మెళుకువలను తెలుసుకున్నారు. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత ‘అన్నక్కిళి’ (రామ చిలుక) అనే చిత్రానికి సంగీతాన్ని కల్పించే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా మారారు. ఇళయరాజా నేపథ్య సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రాలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత ‘బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా’ ను వాడేవారు. 1988 లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణనిధి ఇళయరాజా గారికి ‘ఇసై జ్ఞాని ‘ (సంగీత జ్ఞాని) అనే బిరుదు ఇచ్చాడు. ఇప్పటికి అభిమానులు అతనిని ఇసైజ్ఞాని పేరు పిలుస్తారు. దానితో పాటుగా అదే తమిళనాడు ప్రభుత్వం వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక కళైమామణి పురస్కారం అందుకున్నారు. 1984 లో ‘సాగరసంగమం’ సినిమాకి, 1986 లో ‘సింధుభైరవి’ సినిమాకి, ‘రుద్రవీణ’ సినిమాకు 1989 లో, 2010 లో మలయాళ సినిమా ‘పళస్సీ రాజా’కు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. 1980 లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. 2004 లో ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నేడు ఇళయరాజా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ సంగీత రాజాకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

ఇది రికార్డంటే….ఇళయరాజా మజాకా | Ilaiyaraaja All Time Record |

Leave a comment

error: Content is protected !!