అల్లు అర్జున్… అల్లు రామలింగయ్య మనువడిగా, ప్రొడ్యూసర్ అరవింద్ అబ్బాయిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి కూడా… సినిమా సినిమాకి పెర్ఫార్మెన్స్ లో వైవిద్యం చూపిస్తూ… నటుడిగా తనని తాను మెరుగు పరచుకుంటూ… ఈ తరం టాలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకడిగా స్థానం సంపాదించాడు. ‘టాలీవుడ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసే ఓ ముగ్గురు హీరోల పేర్లు చెప్పండి’ అని అడిగితే అందులో అల్లు అర్జున్‌ పేరు తప్పక ఉంటుంది. ఈ ఏడాదితో తన 18 ఏళ్ల సినీ కెరీర్ లో 20 సినిమాలతో సక్సెస్ ఫుల్ గా ‘రేసుగుర్రం’ లా ‘పరుగు’ తీస్తున్న ‘బన్ని’ 38వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు…

 

అల్లు అర్జున్ ఏప్రిల్ 8న 1983 సం”లో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు చెన్నైలో జన్మించాడు. తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యకి మనవడు. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు అవుతాడు. చిన్నప్పటి నుండి సినీవాతావరణం లోనే పెరిగాడు అర్జున్.

 

‘బన్ని’ పేరు ఎలా వచ్చిందంటే :

బన్ని అనేది తన ముద్దు పేరు. అందరూ అలా పిలవడానికి ఓ కారణం ఉంది. చిన్నతనంలో తన ముందటి పై రెండు పళ్ళు కుందేలుకు లా ముందరికి ఉండటం చేత అందరూ బన్ని అనే పేరుతో పిలిచేవారు. చిన్నప్పటి నుండి అర్జున్ చాలా యాక్టివ్, తను ఎక్కడుంటే అక్కడ అల్లరి చేస్తూ సరదాగా ఉండేవాడు. చిన్నతనంలోనే డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు.

 

బాలనటుడుగా స్పెషల్ అప్పిరియన్స్ :

మెగాస్టార్ చిరంజీవి విజేత సినిమాలోను, కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలతో పాటు… ‘అంకుశం’ రీమేక్ గా చిరంజీవి హిందిలో చేసిన ‘ప్రతిబంధ్’ అనే సినిమాలో ‘ప్యార్ ముజే తుం కర్తే హో’ పాటలో బాలనటుడిగా కనిపిస్తాడు. తర్వాత హీరోగా పరిచయం అయ్యే క్రమంలో మెగాస్టార్ ‘డాడీ’ సినిమాలోను డాన్సర్ రోల్ లో కనిపించాడు బన్ని.

 

హీరో ఎలా అయ్యాడంటే :

బన్ని ఇంట్లో జరిగే ఫంక్షన్స్ లో తన మామయ్య చిరంజీవి సినిమా పాటలకు డాన్స్ చేస్తూ అందరిని ఆకర్షించేవాడు. అలా ఓ సందర్భంలో తన డాన్స్ ను చూసి మెచ్చిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బహుమతిగా 100 రూపాయలను తన తల్లి నిర్మలకు ఇచ్చి బన్ని భవిష్యత్తులో హీరో అయితే ఇదే నా మొదటి అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటున్న అంటూ గిఫ్ట్ చేశారు. అలా ఆ రోజు ఆయన అన్నమాటను విధి నిజం చేస్తూ… తన 100వ సినిమాగా తెరకెక్కిన ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం అయ్యాడు బన్ని. ఈ విషయాన్ని స్వయంగా దర్శకేంద్రుడు తన ‘సౌందర్యలహరి…’ అనే కార్యక్రమంలో చెప్పారు. కె. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ 100 రూపాయల నోటు ఇప్పటికి అల్లు అర్జున్‌ దగ్గర ఉండటం విశేషం.

 

జర్నీ ఫ్రం స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్ :

‘మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు’ అంటూ… ‘గంగోత్రి’ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమై… ‘ఆర్య’ సినిమాతో అందరూ ‘ఐ లవ్ యూ’ ‘బన్ని’ అనేలా తనను తాను మేకోవర్ చేసుకుని డాన్స్, స్టైల్, యాటిట్యూడ్, పెర్ఫార్మర్మెన్ తో ‘స్టైలిష్ స్టార్’ గా తన కంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న ఈ ‘దేశముదురు’ ‘హ్యాపి’ నెస్ తో సిక్స్ ప్యాక్ బాడితో యువతను ను ఆకర్షించి… మరోసారి ‘ఆర్య – 2’ గా స్టైలిష్ లుక్ లో సరికొత్త డాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేసి … ‘జులాయి’ గా ఉన్న రోజుల్లో ప్రేమించిన అమ్మాయి (స్నేహా రెడ్డి) ని వివాహం చేసుకున్న ఈ ‘వరుడు’… ‘వేదం’ వంటి ప్రయోగాత్మక సినిమాలో ‘కేబుల్ రాజ్’ పాత్రలో మెప్పించి… ‘బద్రినాథ్’, ‘ఇద్దరమ్మాయిలతో…’, వంటి అపజయాలకు చిక్కకుండా ‘రేసుగుర్రం’ లా విజయం వైపు ‘పరుగు’లు తీస్తూ… సినిమా సినిమాకి ఇంత కష్టపడుతున్న ఈ కుర్రాడు ‘ఎవడు’ అని అడిగే వారికి తనో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (అల్లు అరవింద్ నే కాదు అల్లు అయాన్, అర్హాకి ఫాదర్ ను కూడా) అని అంటూ… ‘రుద్రమదేవి’ కోసం పాత్ర నచ్చితే పారితోషికం తీసుకోకుండా చేసే ఈ ‘గోన గన్నారెడ్డి’ … యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, యాక్షన్, ఎమోషన్, కామెడి అన్నిటిలోను తనో ‘సరైనోడు’ అనిపించుకున్నాడు ఈ ‘దువ్వాడ జగన్నాథం’. ‘నా పేరు సూర్య నా ఇళ్ళు ఇండియా’ అంటూ తన క్రేజ్ కేవలం దక్షిణాదికే పరిమితం కాదని ‘అల… వైకుంఠపురంలో… సినిమా సక్సెస్ తో నిరూపించాడు. గూగుల్ లో ‘మోస్ట్ సెర్చ్డ్ సౌత్ యాక్టర్’ గా నిలిచి ‘స్టైలిష్ స్టార్’ నుండి ‘ఐకాన్ స్టార్’ గా త్వరలో ‘పుష్ప’ గా రానున్నాడు.

స్పెషల్ రోల్స్ :

అల్లు అర్జున్ క్రిష్ డైరెక్ట్ చేసిన ‘వేదం’ సినిమాలో అనుష్క, మంచు మనోజ్ తో కలిసి నటించాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ‘ఎవడు’ సినిమాలో కాజల్ అగర్వాల్ సరసన ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. గుణశేఖర్ ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్క, రానా దగ్గుబాటి తో కలిసి ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో మెప్పించాడు. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ లోను నటించాడు.

ఇక్కడ అల్లు అర్జున్ అక్కడ మల్లు అర్జున్ :

అల్లు అర్జున్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో… స్టైలిష్‌ లుక్స్ లతో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ…ఇతర రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న ఈతరం ఏకైక సౌత్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తాడు. దానికి ఉదాహరణగా… అల్లు అర్జున్‌ కు తెలుగుతో పాటు మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. కేరళలో అల్లు అర్జున్ అక్కడి టాప్ హీరోలైన మమ్ముటి, మోహన్ లాల్ లకు సమానమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు బన్ని. తెలుగులో అంతగా ఆడని సినిమాలైన ‘వరుడు’, ‘బద్రినాథ్’ వంటి సినిమాలు అక్కడ 100 రోజులకి పైగా ఆడి విజయం సాధించాయి. మలయాళ ప్రేక్షకులు తనని ‘మల్లు అర్జున్’ అని పిలుచుకునేంతలా బన్నిని ఓన్ చేసుకున్నారు. ‘రేసుగుర్రం’ ‘లక్కి ద రేసర్’ గాను ‘సరైనోడు’ వంటి హింది డబ్బింగ్ సినిమాలతో ఉత్తరాదిన కూడా పాపులారిటి పొందాడు బన్ని. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు తాము బన్ని స్టైల్ కి, డాన్స్, ఫైట్స్ మరియు పెర్ఫార్మెన్స్ కి హ్యుజ్ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని బన్ని పై సందర్భానుసారంగా వ్యక్త పరుస్తూనే ఉన్నారు.

 

అవార్డ్స్ :
అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమాలో కనబరిచిన నటనకు గాను నంది అవార్డ్ తో పాటు ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది.
‘పరుగు’ సినిమాలోని సహజ నటనకుగాను నంది అవార్డ్ తో పాటు ఫిలింఫేర్ వరించింది.
‘వేదం’ లోని ‘కేబుల్ రాజ్’ పాత్రకు బెస్ట్ పెర్ఫార్మార్ గా ఫిలింఫేర్ అందుకున్నాడు.
‘రేసుగుర్రం’ లోని హైవోల్టేజ్ ఎనర్జీతో తో కూడిన పెర్ఫార్మార్మెన్స్ కి మరోసారి ఫిలింఫేర్ అందుకున్నాడు.
‘రుద్రమదేవి’ సినిమాలో చేసిన ‘గోన గన్నారెడ్డి’ పాత్రకి నంది అవార్డ్, ఫిలింఫేర్ వరించాయి.
‘సరైనోడు’ గా మరోసారి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ ను అందుకున్నాడు బన్ని.
ఈ అవార్డ్స్ తో పాటు ఐఫా, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా దక్కాయి.

ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న తొలిసారి బన్నితో జతకట్టింది. సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 13న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప’ గా పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఇలా మరెన్నో విజయవంతమైన సినిమాల ద్వారా అభిమాను లను ప్రేక్షకులను అలరించాలని మూవీ వాల్యూం విష్ చేస్తుంది హ్యాపి బర్త్ డే స్టైలిష్ స్టార్ కాదు… కాదు… హ్యాపి బర్త్ డే ‘ఐకాన్ స్టార్’.

 

Leave a comment

error: Content is protected !!