విఠలాచార్య సినిమాలు చూసిన వారికి హెచ్.ఎస్ వేణు పేరు బాగా పరిచయం ఉంటుంది. జనాలకు బాగా నచ్చే పద్దతిలో దయ్యాలు చేసే ఫీట్లు … రాక్షసాకారాల విన్యాసాలు కత్తి యుద్దాలు … ఒకటేమిటి … ఒక్కసారి థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులను వేరే లోకాల్లో తిప్పేసి వదిలేయడం విఠలాచార్య పద్దతి.
దీన్ని సాకారం చేయడంలో ఆయనకు పూర్తిగా సహకరించిన వాడు హెచ్ఎస్ వేణు. ఈ వేణు ఎవరో కాదండి … గాయని ఎమ్మెల్ వసంతకుమారికి స్వయాన తమ్ముడు.
వేణు గారు పుట్టింది మద్రాసే అయినా … పెరిగింది చదివింది ఎర్నాకులంలో … చదువుకునే రోజుల్లో నాటకాల్లో పాత్రలు వేసేవాడు. బొమ్మలు గీసేవాడు. అలా ఆడుతూ పాడుతూ జీవితం సాగుతుండగా షడన్ గా నావీలో చేరాలన్న నిర్ణయం తీసుకుని వెళ్లిపోయాడు.
దాదాపు రెండేళ్లు అక్కడే ఉన్నాడు. ఇక చాలని బయటకు వచ్చాక … కొంత కాలానికి తండ్రి కన్నుమూశారు. అప్పుడు మద్రాసు అక్కగారింటికి చేరుకున్నాడు.
బొమ్మలేసే టాలెంటును చూసి ఎవరో సినిమా స్టూడియోలో ఆర్టు డిపార్టమెంటులో పనుంటుంది … చేరమంటే చేరిపోయాడు. చేరిన రెండు నెల్లలోనే అక్కడ పాతుకుపోవడం అంత వీజీకాదనే విషయం అర్ధమైపోయింది.
అక్కడ నుంచీ మరొకరి సలహా మేరకు కెమేరా డిపార్ట్మెంటుకు మారాడు. అక్కడా జీతం లేదు … అయితే నెమ్మదిగా అనుభవం రావడం మొదలైంది. పనులు ఒంటపడుతున్నాయి.
అలా న్యూటోన్ స్టూడియోలో జీతం లేకుండా పన్జేస్తున్న సమయంలో 1949 ప్రాంతాల్లో … వాహినీ స్టూడియో ప్రారంభిస్తున్న సమయంలో వేణుగారికి ఉద్యోగం ఆఫర్ వచ్చింది.
నెలకు యాభై రూపాయల జీతం. వాహినీలో స్టూడియో అసిస్టెంటుగా దాదాపు 1962 వరకు పనిచేశారు.
మార్కస్ భార్ట్ లే , సెల్వరాజ్, , పిఎల్రాయ్, జతిన్ బెనర్జీ తదితరుల దగ్గర పనిచేయడంతో కెమేరాకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం వచ్చేసింది.
ఇలా ఉండగా ఓ రోజు విఠలాచార్య పిల్చి ఏమయ్యా నా సినిమాలకు పన్జేస్తావా … డీఓపీగా అని అడిగారు. సై అన్నారు వేణు. అలా జయవిజయ చిత్రంతో డీఓపీ అయ్యి … జానపద చిత్రాల కెమేరామెన్ గా స్థిరపడిపోయారు.
అయితే అంతకు ముందు కూడా ఓ అవకాశం వచ్చింది వేణుగారికి. అండమాన్ ఖైదీ అనే సినిమాకు సొంతంగా పన్జేశారు. అయితే అంత పేరు రాలేదు. కానీ జయవిజయ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.
అందుకు కారణం అందులో డబుల్ రోల్ సీన్లను బాగా తీయగలగడమే.
అగ్గిదొర, అగ్గిపడుగు, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, ఆలీబాబా నలభై దొంగలు, గండికోట రహస్యం ఇలా విఠలాచార్య తీసిన సినిమాలన్నిటికీ ట్రిక్ షాట్స్ తో పాటు అన్నీ తనే చూసుకునేవారు వేణుగారు. డబుల్ యాక్షన్ సినిమాలకు ఆయన పనిచేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. తెర మీద నిజంగానే ఇద్దరు రామారావులు నటించారా అని జనం అనుకునేలా చూసుకునేవారు.
వేణు పన్జేసినన్ని జానపద చిత్రాలు బహుశా ఏ కెమేరామెన్నూ పన్జేసి ఉండరు. అలా విఠలాచార్యను జానపద బ్రహ్మ అనుకుంటే వేణుగారిని జానపద కెమేరా బ్రహ్మగా చెప్పుకోవాలి. విఠలాచార్య సినిమాలకు పనిచేస్తూనే కొంత కాలం గౌరీ ప్రొడక్షన్స్ కంపెనీకి పర్మినెంటు డీఓపీగా వ్యవహరించారు. పింజల సుబ్బారావు బ్యానర్ లో సుగుణసుందరి కథ అనే ఓ జానపద సినిమా డైరక్ట్ చేశారు కూడా.
ఆ తర్వాత విజయలలిత డ్యూయల్ రోల్ లో సవాల్ కు సవాల్ అనే ఓ గూఢచారి తరహా సినిమా కూడా డైరక్ట్ చేశారు. అది పెద్దగా ఆడలేదు.
జానపద చిత్రాలతో పాటు అమ్మాయిల శపథం లాంటి సాంఘిక చిత్రాలకూ ఆయన కెమేరా పనిచేశారు.
సినిమా సాంఘికమైనా జానపదమైనా పౌరాణికమైనా దర్శకుడు ఏమి ఆశిస్తున్నాడో దాన్ని అందించడమే కెమేరాదర్శకుడి ప్రధమ కర్తవ్యంగా ఉంటుందనేవారు వేణు. విఠలాచార్య తనకు కావాల్సిన ఎఫెక్టును వివరించి చెప్పిన తర్వాత దాన్ని తెర మీద ఎలా సానుకూలపరచాలా అని విపరీతంగా ఆలోచించేవాడిని అనేవారాయన.
జానపద చిత్రాలు చూడడానికి వచ్చే ప్రేక్షకుల మనసుల్లో ఏముంటుందో తెల్సుకుని ఆ విధమైన విన్యాసాలన్నీ తెర మీద నిండుగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగేదనీ … టైటిల్స్ నుంచీ ఆ ఫీల్ క్యారీ అయ్యేలా చూసుకునేవాళ్లం అని చెప్పేవారు వేణు.
విఠలాచార్య కెరీర్ లో చివరి చిత్రాలైన జగన్మోహిని గంధర్వకన్య తదితర చిత్రాలకు కూడా వేణునే కెమేరామెన్ను. అలా … తెలుగువారి జానపద కెమేరా బ్రహ్మగా వేణుగారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
Writer – Bharadwaja Rangavajhala