చింతనిప్పుల్లాంటి కళ్ళు.. చిరుతపులిలాంటి చూపు.. పిడుగులు పడినట్టు డైలాగ్ డెలివరీ…దర్జా, దర్పం ఉట్టిపడే అభినయ ఆంగికాలు ఆయన ప్రత్యేకతలు. స్వచ్ఛమైన ఉచ్ఛారణ.. ఆయన భూషణం. ఆ నందమూరి టైగర్ .. హరికృష్ణ. ‘కృష్ణావతారం’లో బాలకృష్ణుడిగా నటించి మెప్పించి తొలి అడుగులోనే శభాష్ అనిపించుకున్నారు. ‘తాతమ్మ కల’ కోసం మరోసారి మేకప్ వేసుకున్నారాయన. ఆ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. దాంతో.. తండ్రి దగ్గరే నట పాఠాలు నేర్చుకునే అవకాశం దక్కింది. ‘తల్లా? పెళ్లామా’తో నటుడిగా మరో మెట్టు ఎక్కారు. ఎన్టీఆర్ సినీ జీవితంలో మర్చిపోలేని చిత్రాల్లో ‘దానవీరశూర కర్ణ’ ఒకటి. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తూ, మరోవైపు దర్శకత్వం వహిస్తూ, నిర్మాణ బాధ్యతల్నీ చేపట్టారు. తండ్రిపై ఆ భారాన్ని తగ్గిస్తూ నిర్మాణ పనుల్ని దగ్గరుండి చూసుకున్నారు హరికృష్ణ. ‘శ్రీరాములయ్య’ వరకూ ఆయన నటనకు దూరంగానే ఉన్నారు. అందులో కామ్రేడ్ సత్యం పాత్ర హరికృష్ణ ఆవేశానికి అద్దం పట్టింది. అక్కడి నుంచి హరికృష్ణపై దర్శక నిర్మాతల ఫోకస్ పడింది. అవకాశాలు వరుసకట్టాయి. ‘సీతారామరాజు’లో నాగార్జున, హరికృష్ణ అన్నదమ్ములుగా నటించారు. తమ్ముడంటే మమకారం, ఊరంటే ప్రాణం. ఇదీ అందులో ఆయన పాత్ర తీరు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ నటుడిగా హరికృష్ణలో విభిన్నకోణాల్ని బయట పెట్టింది.
ఇక హరికృష్ణ సోలో హీరోగా చేసిన మొదటి చిత్రం ‘సీతయ్య’నే చెనందమూరి టైగర్ప్పుకోవాలి. అంతకు ముందు బాలనటుడిగా, క్యారెక్టర్ నటుడిగా హరికృష్ణని చూసిన ప్రేక్షకులు ‘సీతయ్య’లో ఉగ్రరూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ‘ఎవరి మాటా వినడు సీతయ్యా’ అనే డైలాగ్ అయితే ఓ బ్రాండ్ అయిపోయింది. ఆ తర్వాత ‘టైగర్ హరిశ్చంద్రప్రసాద్’ ‘స్వామి’, ‘శ్రావణమాసం’… లాంటి పలు చిత్రాలతో అభిమానుల్ని అలరించారు . నేడు హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.