Harihara Veeramallu : తెలుగు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంపై అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పునఃప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఈ నెల 23 నుండి విజయవాడలో ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు 400 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు పాల్గొననున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్‌ ఈ భారీ యుద్ధ సన్నివేశాలను రూపొందించనున్నారు.  ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1 – స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్రం విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

Leave a comment

error: Content is protected !!