ఆమె అందంలో రాణి.. అభినయంలో మారాణి. యాక్షన్ డైనమైట్.. డైలాగుల బుల్లెట్. ఒకప్పుడు దక్షిణాది వెండితెరకు ఆమె సూపర్ స్టార్. అందరు అగ్ర కథానాయకులకూ ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అందరు స్టార్ డైరెక్టర్స్ కూ ఆమె కాల్షీట్స్ కావాలి. ఒక పక్క హీరోల పక్క గ్లామర్ ను ఒలికిస్తూనే.. మరో పక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో అభినయాన్ని పండిస్తూ.. రెండున్నర దశాబ్దాల కాలం పాటు .. టాలీవుడ్ ను ఏలిన కథానాయిక ఆమె. పేరు విజయశాంతి. అప్పట్లో ఆమె క్రేజ్ కు లేడీ అమితాబ్ అని పిలుచేవారు.

జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా లాంటి దర్శకుడి దగ్గర  నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని. అయితే .. 1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించాకా విజయశాంతిని ఎంచుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పలు  చిత్రాలలో నటించింది. ఆమెను “ద లేడీ సూపర్ స్టార్”, “లేడీ అమితాబ్” గా అభిమానులు పిలుచుకున్నారు.  1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది విజయశాంతి. అంతేకాదు ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది, నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 2006లో నాయుడమ్మ తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన విజయశాంతి.. ఈ ఏడాది విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా తన నటనా పటిమను రుచిచూపించింది. నేడు విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ లేడీ సూపర్  స్టార్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!