మంత్రముగ్ధుల్ని చేసే ముఖం.. మంత్రం వేసే చిరునవ్వు.. కలువల్లాంటి కళ్ళు.. కనికట్టు చేసే రూపం… వెరశి రాశి. దక్షిణాది వెండితెరకే అందాల రాశి. బాలనటిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించి.. ఆపై కథానాయిగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన రాశికి మంత్ర అని మరో పేరు కూడా ఉంది. 1986లో ‘మమతల కోవెల’ అనే చిత్రంలో రాజశేఖర్ కి కూతురిగా నటించింది. ఆ తరువాత ‘రావుగారిల్లు’, ‘బాలగోపాలుడు’, ‘ఆదిత్య 369’, ‘అంకురం’, ‘పల్నాటి పౌరుషం’ చిత్రాల్లో సైతం నటించి సత్తా చాటుకుంది . 1997లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పెళ్ళిపందిరి’, ‘గోకులంలో సీత’, ‘శుభాకాంక్షలు’ చిత్రాలతో కథానాయికగా తెలుగుతో తన జోరును చూపించింది రాశి. ‘స్నేహితులు’, ‘పండగ’, ‘దేవుళ్లు’, ‘గిల్లికజ్జాలు’ తదితర చిత్రాలతో నటిగా తన ప్రతిభని ప్రదర్శించింది ఆ అందాల రాశి . హిందీలో మిథున్‌ చక్రవర్తితో కలిసి ‘రంగ్బాజ్‌’, ‘సూరజ్‌’, ‘జోడిదార్‌’ చిత్రాలు చేశారు. తమిళంలో విజయ్, అజిత్‌ తదితర అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడింది. మలయాళం, కన్నడలోనూ ఆమె చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకొంది. తెలుగులో పలు విజయాల్ని సొంతం చేసుకొన్న రాశి, ‘సముద్రం’లో ప్రత్యేక గీతం చేసి తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. అలాగే ‘నిజం’లో నెగెటివ్ షేడ్స్ తో  కూడిన పాత్ర చేసి మెప్పించింది. ‘కల్యాణ వైభోగమే’, ‘ఆకతాయి’ చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్రని చేసి క్యారెక్టర్‌ నటిగా తన కెరీర్‌ని తీర్చిదిద్దుకొనే ప్రయత్నం చేసింది.  ప్రజెంట్ సీరియల్స్ లో నటిస్తున్నారు. అందాల రాశిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండే ఆమె పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాశికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే రాశి…

Leave a comment

error: Content is protected !!