హ్యాండ్సమ్ ఫేస్.. మ్యాన్లీ లుక్స్ .. లౌవ్లీ స్మైల్.. కలగలిస్తే మాధవన్. మ్యాడీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే ఆయన .. సౌత్ లో వైవిధ్యమైన పాత్రలకు, విలక్షణమైన నటనకు పెట్టింది పేరు. రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డు అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో మాధవన్ ఒకరు.
కెరీర్ మొదట్లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. 1996లో జీ టీవీలో బాగా హిట్ అయిన బనేగీ అప్నీ బాత్ సీరియల్ లో కూడా నటించారాయన. ఎన్నో ప్రకటనల్లోనూ చిన్న పాత్రల్లోనూ నటించిన తరువాత మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలై పాయుదే (సఖి) తో కెరీర్ లో పెద్ద మలుపు వచ్చింది. ఆ తరువాత ఏడాది గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే (చెలి), మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రసిద్ధి చెందారు మాధవన్. 2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్ (అమృత) సిన్మాలో నటించారాయన. ఆ సినిమాకు, మాధవన్ నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. పరిశ్రమకు కొత్తగా వచ్చిన వెంటనే మూడు భాషల్లో అవకాశాలను అందుకున్న ఏకైక నటుడు మాధవన్ మాత్రమే. అలాగే బాలీవుడ్ లో కూడా మాధవన్ మంచి నటుడు అనిపించుకున్నాడు. హీరోగానే కాకుండా ‘రాకెట్రీ’ సినిమా తో డైరెక్టర్ గా రాబోతున్నారు మాధవన్ . ఈ సినిమా ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మధ్యనే రిలీజైన రాకెట్రీ’ – ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు మాధవన్ పుట్టిన రోజు .. ఈ సందర్బంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.