ప్రకాష్‌రాజ్‌ పరిచయం అవసరం లేని నటుడు. ఏ భాషలో నటిస్తే ఆ భాష మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ అంటే ‘మావా(నటు)డే అనేంతలా ప్రేక్షకులకు అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన కన్నడ మాతృభాష అయినప్పటికి కూడా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడటం ప్రకాష్‌రాజ్‌ ప్రత్యేకత. ఆయన ఆరు భాషల్లో వందల చిత్రాలకు పైగా నటించారు.

రంగస్థల నటుడిగా కెరీర్‌ ఆరంభించిన ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించారు. సెంట్‌ జోసెఫ్స్‌ బాయ్స్‌ హైస్కూల్, సెంట్‌ జోసెఫ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదువుకొన్నారు. ప్రకాష్‌రాజ్‌ అసలు పేరు ప్రకాష్‌ రాయ్‌. చిత్ర రంగంలో ఆయనకి గురురైన ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ సలహాతో ప్రకాష్‌ రాజ్‌గా పేరు మార్చుకున్నారు. నాటక రంగం నుంచి వచ్చిన ప్రకాష్‌రాజ్‌ బెంగుళూరులోని కళాక్షేత్రలో పలు నాటకాల్లో అభినయించారు. ఆ తరువాత కన్నడ టెలివిజన్‌ రంగంలోకి, సినిమాల్లోకి అడుగుపెట్టారు. అలా 1994లో ‘డ్యూయెట్‌’తో తమిళంలో పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ప్రకాష్‌రాజ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత నుంచి ఆయనకి తెలుగు, మలయాళం, హిందీ భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో ‘సంకల్పం’తో పరిచయమై ఆ తరువాత ‘గన్‌షాట్‌’, ‘వినోదం’, ‘పవిత్రబంధం’, ‘సుస్వాగతం’, ‘హిట్లర్‌’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘అంతఃపురం’… ఇలా ఆయన చేసిన ప్రతి పాత్ర పేరు తెచ్చిపెట్టి  ప్రకాష్‌రాజ్‌ని ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మార్చేసింది.

ప్రకాష్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటించిన ప్రతినాయకుడి పాత్రలే… ‘సుస్వాగతం’ చిత్రంలో ‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు’ అంటూ ఆయన పలికే డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రకాష్ రాజ్ కి అధ్బుతమైన పాత్రలు ఇచ్చిన దర్శకులు కృష్ణవంశీ, వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్, గుణశేఖర్‌ల సినిమాల్లోని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రచయితగా ఉన్న సమయంలో వచ్చిన సినిమాలలో ప్రకాష్‌రాజ్‌ పోషించిన పాత్రలకూ విశేష ప్రేక్షకాదరణ లభించింది.

తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలు

‘ఇద్దరు’, ‘సుస్వాగతం’, ‘చూడాలని ఉంది’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘బద్రి’, ‘అంతఃపురం’, ‘ఇడియట్‌’, ‘ఒక్కడు’, ‘దిల్‌’, ‘ఖడ్గం’, ‘ఠాగూర్‌’, ‘ఆజాద్‌’, నువ్వే నువ్వే  , ‘పోకిరి’, ‘అతడు’, ‘బొమ్మరిల్లు’, ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శతమానం భవతి’, ‘రంగస్థలం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ఇలా అనేక చిత్రాల్లో ప్రకాష్‌రాజ్‌ పోషించిన పాత్రలను ఎవరూ మర్చిపోలేరు.

వ్యక్తిగత జీవితం :

ప్రకాష్‌రాజ్, నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకొన్నారు. ఈమె ప్రముఖ నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి చెల్లెలు. ఈ ఇద్దరూ 2009లో విడిపోయారు. అనంతరం ప్రకాష్‌రాజ్‌ ప్రముఖ నృత్య దర్శకురాలైన పోనీ వర్మని వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకి వేదాంత్‌ అనే అబ్బాయి ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటారు ప్రకాష్‌రాజ్‌. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొని సేంద్రియ వ్యవసాయం పై అక్కడి రైతులకు అవగాహనా కలిగించి సేద్యం చేస్తూ ఆ గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.

సాధించిన అవార్డ్స్ :

‘ఇద్దరు’, ‘అంతఃపురం’, ‘కాంజీవరమ్‌’ చిత్రాలతో జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ‘పుట్టక్కన్న హైవే’ అనే కన్నడ చిత్రానికి నిర్మాతగా కూడా జాతీయ పురస్కారం అందుకొన్నారు. అయిదుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు, ఆరుసార్లు నంది అవార్డు, ఇంటర్నేషనల్‌ తమిళ్‌ ఫిల్మ్‌ అవార్డు ఒకసారి, తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డును నాలుగుసార్లు, విజయ అవార్డును మూడుసార్లు సొంత చేసుకున్నారు.

అభిరుచితో చేసిన సినిమాలు :

ప్రకాష్ రాజ్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాతగా కూడా పలు చిత్రాల్ని రూపొందించారు. ప్రకాష్‌రాజ్‌లో మంచి పాఠకుడు, రచయితత ఉన్నారు. దర్శకుడిగా ఆయన నాలుగు చిత్రాలు చేశారు. తెలుగులో ‘ధోని’, ‘మనవూరి రామాయణం’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.

నటుడిగా, ప్రతినాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన ప్రకాష్ రాజ్ మరిన్ని చిత్రాలలో తన విలక్షణ నటనతో అలరించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!