ఆయన కుడిచేయి లేపి.. ఎడమకాలు కదిపితే నృత్య ప్రకంపన. బాడీ షేక్ చేస్తూ.. అవయవాలన్నీ బ్రేక్ చేస్తే డ్యాన్సింగ్ సెన్సేషన్. స్ర్పింగ్ ఏదో మింగినట్టు .. కాళ్ళకింద భూమేదో కుంగినట్టు … ఆయన వేసే మాసీ స్టెప్స్ కు దుమ్మురేగిపోవాల్సిందే. పేరు ప్రభుదేవా ‘ఇండియన్ మైకేల్ జాక్సన్’ అనగానే అందరికి గుర్తుకువచ్చే పేరే కాదు డాన్స్ చేస్తున్న రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. తనదైన శైలిలో డాన్స్ లను కంపోజ్ చేస్తూ సరికొత్త ఒరవడిని తీసుకువచ్చి దక్షిణాది, ఉత్తరాది అగ్రతారలతో ఉర్రూతలూగించే స్టెప్స్ వేయించిన డాన్స్ మాస్టర్. ఆయనే డ్యాన్స్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ప్రభుదేవ కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా నటుడిగా… కోరియోగ్రాఫర్ గా… డైరెక్టర్ గా కూడా తనదైన ముద్ర వేశాడు. ‘చికు బుకు చికు బుకు రైలే’ అంటూ ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన ఈ ఇండియన్ ‘మైఖెల్ జాక్సన్’ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు…
ప్రభుదేవా కర్నాటక – చెన్నై సరిహద్దులోని మైసూరులో 1973 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మహదేవమ్మ, సుందరం మాస్టర్. చిన్నతనంలో ప్రభుదేవాకు డ్యాన్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదట. ఆయనకు ఫుట్ బాల్ ఆటపై ఆసక్తి ఎక్కువుగా ఉండేదట అలా ఫుట్ బాల్ అటలో గోల్ కొట్టపోయి తన తండ్రి డాన్స్ ల ప్రేరణతో దృష్టిని సినీ ఇండస్ట్రీ వైపుకు మరల్చాడు ప్రభుదేవా. తన తండ్రి సుందరం మాస్టరు కూడా ఎన్నో చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేశారు. ప్రభుదేవా సోదరులు రాజ్ సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా డ్యాన్స్ మాస్టర్లు కావడం విశేషం.
ప్రభుదేవా చిన్నతనంలోనే భరత నాట్యంలో మంచి శిక్షణ పొందాడు. అలానే వెస్ట్రన్ స్టైల్ లో కూడా అదే రీతిలో తనదైన క్యాచి మూవ్మెంట్స్ తో డాన్స్ ను చూసే వారందరిని ఆశ్చర్యపరిచేవాడు.
కొరియోగ్రాఫర్ గా తొలి అవకాశం :
ప్రభుదేవా ను మెగాస్టార్ చిరంజీవి ‘రాజా విక్రమార్క’ చిత్రంతో కొరియోగ్రాఫర్ గా తొలి అవకాశం ఇచ్చి పరిచయం చేశారు. ‘గగన కిరణ గమనమిది’ అని సాగే పాటతో తన డాన్స్ కొరియోగ్రఫీ ప్రస్థానం మొదలయ్యింది. ఆ పాటతో తనలోని డాన్స్ కొరియోగ్రాఫర్ సత్తా ఏపాటిదో తొలిపాట చిరంజీవితోనే అబ్బురపరిచే స్టెప్స్ వేయించి చూపించారు. అప్పటి నుండి తన సినీ ప్రస్థానంలో సుమారు వంద సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా చేశారు. అలా తన క్రేజీ డాన్స్ లతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
నటుడిగా తొలి చిత్రం :
కెరీర్ తొలినాళ్ళలో ప్రభుదేవా కేవలం డ్యాన్స్ చేస్తూ కొరియాగ్రాఫర్ గానే పరిమితం కాలేదు. నటుడిగా 1994లో ‘ఇంధు’ అనే చిత్రం ద్వారా వెండితెరపై ప్రేక్షకలోకానికి పరిచమయ్యాడు. పవిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా రోజా నటించారు. ఈ సినిమాలో తనలోని నట విశ్వరూపం కూడా చూపించారు ప్రభుదేవా. అలా ఆ చిత్రం నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తర్వాత శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ప్రేమికుడు’ సినిమా అఖండ విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కొరియోగ్రఫీ – నటన తర్వాత దర్శకుడిగా :
మన టాలీవుడ్ లోనూ చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో పాటు యువ కథానాయకులతో కూడా కొత్త కొత్త స్టెప్పులు వేయించారు. తను డైరెక్టర్ గా మారి చేసిన తొలి సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా‘ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి 9 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు సైతం లభించాయి. ఈ సినిమాని పలు భాషల్లోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది.
‘ప్రేమికుడు’ లోని ‘ముక్కాబులా ముక్కాబులా’ పాటతో బాలీవుడ్ పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. అదే పాటను ఇటీవల రీమిక్స్ చేయగా మంచి ఆదరణ లభించింది. అటూ బాలీవుడ్ తారలైన అమితాబ్ బచ్చన్ తో పాటు హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ తో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులతో కొత్త కొత్త స్టెప్పులు వేయించారు.
డైరెక్టరైన ప్రభుదేవా ఆ తర్వాత తెలుగులో ‘పౌర్ణమి’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టి అజయ్ దేవగణ్, అక్షయ్‌కుమార్ వంటి అగ్ర నటుల చిత్రాలకి దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్ తో ‘దబాంగ్’ కి మూడో నేపథ్యంగా వచ్చిన ‘దబాంగ్ 3’ కి దర్శకత్వం వహించారు.
కొన్ని వివాదాలు :
ఇలా సాగుతున్న తన ప్రయాణంలో వివాదాలు కూడా లేకపోలేదు. హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం… ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిన వార్తలు అప్పట్లో చర్చనీయమయ్యాయి.
అవార్డ్స్ :
ప్రభుదేవా ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గా రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీటితో పాటు ఇతర అవార్డులను అనేకం గెలుచుకున్నాడు. డ్యాన్స్ లో మరియు సినిమా రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రభుదేవాకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ఇలా కెరీర్ లో మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ… కొరియోగ్రాఫర్ గాను మరిన్ని వైవిధ్యమైన డాన్స్ లతో అలరించాలని కోరుతూ బర్త్ డే విషెస్ తెలుపుతుంది మూవీ వాల్యూం.