అందమైన అభినయం …. అభినయానికి తగ్గ అందం .. చక్రాల్లాంటి కళ్ళు.. చురుకైన చూపు. చిరునవ్వుల మోము.. ఆమె చిరునామా. వీటికి తోడు అద్భుతమైన నాట్యం. వెరసి  మాధురీ దీక్షిత్.  ముఫ్పైఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఆమెలో  ఇప్పటికీ వన్నె తగ్గలేదు. అదే అందం, అదే హుషారు. ఎయిటీస్ , నైంటీస్ లో ఆమెది ఒక హవా. యావత్ భారతీయ ప్రేక్షకులు ఆమెను ఒక దేవతలా ఆరాధించారు. తొలినాళ్లల్లో ఎన్ని పరాజయాలెదురైనా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఆమె అందం, నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడమే కారణం. వరుస పరాజయాల తరువాత ‘తేజాబ్‌’ చిత్రంతో భారీ విజయాన్ని సాధించడంతో ఇక తిరుగులేకుండా పోయింది. ఆ ఏడాది భారీ వసూళ్లు సాధించిన చిత్రంలో అదొకటి. మాధురి డ్యాన్సుల గురించి బాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పుకొన్నారు.

తొలి విజయం తరువాత మళ్లీ అనిల్‌కపూర్‌తోనే చేసింది. ‘రామ్‌లఖన్‌’, ‘ప్రేమ్‌ ప్రతిజ్ఞ’, ‘త్రిదేవ్‌’, ‘పరింద’ తదితర చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. 1990 నుంచి మాధురి హవా మొదలైంది. ‘దిల్‌’లో అమిర్‌ఖాన్‌ సరసన నటించింది. బాగా డబ్బున్న ఓ పొగరుబోతు అమ్మాయిగా మాధురి నటన అందరినీ ఆకట్టుకుంది. తరువాత బాలీవుడ్‌లోని అగ్రకథానాయిక హోదాని సంపాదించుకొంది. దీంతో సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్‌లాంటి స్టార్‌ కథానాయకలతో ‘సాజన్‌’ అనే చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ‘బేటా’, ‘ఖల్‌నాయక్‌’, అంజామ్‌’, హమ్‌ అప్‌కే హై కౌన్‌’, ‘గదర్‌’.ఇలా విజయపరంపర కొనసాగుతూనే వచ్చింది. ‘రాజా’, ‘యరానా’, ప్రేమ్‌గ్రంధ్‌’, ‘మృత్యుదంద్‌’, ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘వజూద్‌’, ‘అర్జూ’, ‘పుకార్‌’, ‘గజగామిని’, ‘యే రాస్తే హూ ప్యార్‌ కే’, ‘లజ్జా’ ‘దేవదాస్‌’ తదితర చిత్రాలు మాధురిలో సిసలైన నటిని ఆవిష్కరించాయి. నటిగానే కాదు.. ఓ డ్యాన్సర్ గా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది మాధురి. సుమారు పదిహేనేళ్లపాటు హిందీ చిత్రసీమలో స్టార్‌ కథానాయికగా వెలిగింది మాధురి. అగ్రకథానాయకులందరూ ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తిచూపేవారు. 1999లో వైద్యుడు శ్రీరామ్‌ నెనెని వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఈ మధ్యనే మళ్ళీ తెరపైకొచ్చిన మాధురీ దీక్షిత్  ‘కళంక్‌’ చిత్రంలో బహార్‌ బేగమ్‌గా నటించింది. నేడు మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్. 

 

Leave a comment

error: Content is protected !!