తెలుగు సంస్కృతికి, ఆత్మగౌరవానికి ఆయన చిత్రాలు ప్రతీకలు. తెలుగు కళలకు ఆయన కాణాచి. తెలుగు కళామతల్లి పాదాలకు సిరిసిరి మువ్వలు కట్టి.. సంగీతం, నాట్యకళ సాగర సంగమమని చాటిచెప్పి.. తెలుగు సాంప్రదాయాలకు స్వర్ణకమలార్చన చేసి.. శుభ సంకల్పంతో , చిత్త శుద్ధితో ఎన్నో ఆణి ముత్యాల్లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన స్వాతి ముత్యం లాంటి మనసు ఆయనది. పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ కళా జ్యోతి కి తన రెండు చేతులూ అడ్డు పెట్టి.. భారతీయ కళా వైభవాన్ని ప్రజ్వరిల్ల చేయడానికి మన తెలుగు తెరకు తరలి వచ్చిన కళా తపస్వి ఆయన. పేరు కాశీ నాథుని విశ్వనాథ్ .
శాస్త్రీయ సంగీతం సంఘ హితానికేనని చాటిచెప్పే ‘శంకరాభరణం’. సంగీతం, నాట్యం అర్ధనారీశ్వర తత్వమని చెప్పే ‘సాగరసంగమం’, పడమర పడగలపై మెరిసే తారలకై భ్రమలో బ్రతకక.. తూరుపు వేదికపై వేకువ నర్తకిలా ధాత్రిని మురిపించే కాంతులు చిందించాలి అంటూ మీనాక్షిలాంటి అమ్మాయిలకు జ్నానోదయమయ్యేలా సందేశమిచ్చిన ‘స్వర్ణకమలం’. సంగీతానికి కళ్ళతో పనేముంది? ఈ సమస్త ప్రకృతిని తన మనసుతో అర్దం చేసుంటే చాలని చాటిచెప్పే ‘సిరివెన్నెల’ , అంతరించి పోతున్న జానపద కళా రీతుల్ని తిరిగి పునర్జీవింపచేసే కథతో ‘సూత్రధారులు’, డప్పుది, మువ్వది జన్మజన్మల బంధమని చాటిచెప్పే ‘సిరిసిరిమువ్వ’.. ఇలా విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమాలోనూ భారతీయ సంస్కృతి యొక్క ఆత్మ దాగి ఉంది.
కమర్షియల్ సినిమాలు కాసులు కురిపిస్తున్న రోజులలో హంగు, ఆర్భాటాలు లేకుండా సంప్రదాయ సంగీతం ఇతివృత్తంగా తెరకెక్కించిన శంకరాభరణం సినీ విమర్శకులను విస్మయపరిచింది. సంగీత అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా హాలుకు రప్పించింది. అనేక మందికి సంగీతంపై మక్కువ కలిగించింది. వైవిధ్య దర్శకునిగా విశ్వనాథ్‌ను నిలబెట్టింది. సామాజిక అంశాలను స్పృశిస్తూ, ఇరు మనస్సుల ఇష్టాన్ని గౌరవిస్తూ, వివాహ బంధానికి విలువనిస్తూ…ఆ బంధం కులమతాలకు అతీతమైందన్న ఆదర్శభావాన్ని సందేశాత్మకంగా తీర్చిదిద్దిన చిత్ర సప్తపది. సప్తపది జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డును దక్కించుకొన్నది. ‘శృతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం’ లాంటి చిత్రాలు కళాత్మకతకు రాజయోగం తీసుకువచ్చాయి అన్నది యదార్థం. విశ్వనాథ్ మేధోమథనం నుంచి పుట్టిన అమృతకలశం సాగరసంగమం. ఆస్కార్ సినీ యవ్వనికపై ఆయన ప్రతిభ స్వాతిముత్యమై మెరిసింది. భారతీయ సినిమాకి ఎనలేని యశస్సును తెచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ వంటి అవార్డులను అందుకున్న యశస్వి, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ మహా దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.