ఆయన కన్నుపడితే.. ఎలాంటి లొకేషన్ అయినా అద్భుతమైపోతుంది. ఎలాంటి  సన్నివేశమైనా అసాధరణమైపోతుంది. ఫ్రేమ్ ఫ్రేమ్ లోనూ ఆయన ప్రతిభ కనిపిస్తుంది. షాట్ షాట్ లోనూ ఆయన ఆలోచన అవగతమవుతుంది. మామూలు కథతో తీసే సినిమా కూడా ఆయన కెమేరా పనితనంతో .. తెరకెక్కితే అది మరో లోకాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ ఛాయా గ్రాహకుని పేరు హరి అనుమోలు. కొత్త దర్శకులకు ఆయనొక వరం. కొత్త గా తెరకు పరిచయమయ్యే నటీనటులకు ఆయన మార్గ దర్శకుడు. ఈ తరం సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర .. హరి అనుమోలు తనయుడే.  

హరి అనుమోలు 1976లో తన కెరీర్ ప్రారంభించారు. అయితే 1979 లో ఆయన పూర్తి స్థాయి టెక్నీషియన్ గా మారాడు. కొత్తగా ప్రవేశించే దర్శకులు చాలా మంది ఈయన్ను సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. అలా ఆయన 30 కి పైగా నూతన దర్శకులతో పని చేశాడు. ఇందులో వంశీ , విక్రం, కె. ఎస్. రవికుమార్, ఎస్. ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్, లాంటి ప్రముఖ దర్శకులున్నారు. తమిళంలో కూడా ఏడుగురు నూతన దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది. ‘స్వాతి, ఆలాపన, స్వరకల్పన , మంచు పల్లకి, అమెరికా అబ్బాయి, భలే మామయ్య, జైత్రయాత్ర, అరణ్యకాండ, లేడీస్ టైలర్, శ్రీకనక మహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ , మయూరి, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, స్టూడెంట్ నెం.1, గణేశ్ లాంటి సూపర్ హిట్ మూవీస్ ఎన్నిటికో ఆయన కెమేరా ప్రాణం పోసింది. ఇక పోలీస్ రిపోర్ట్ అనే సినిమాకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వంలో  అదే మొదటి, ఆఖరి సినిమా . నేడు హరి అనుమోలు పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆ కెమేరా మాంత్రికుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది.

Leave a comment

error: Content is protected !!