తెలుగునాట పవన్ కళ్యాణ్ కున్న స్టార్ డం, క్రేజ్, మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు కదా..! అదే స్థాయిలో తమిళనాట అగ్ర హీరోగా ఒకరిగా విశేషమైన స్టార్ డం సంపాదించి విపరీతమైన మాస్ క్రేజ్ ను సొంతం చేసుకున్న నటుడు అజిత్ కుమార్. ఆయన్ను అభిమానులు బాక్సాఫీస్ ‘తలా‘ అని పిలుచుకుంటారు. ఆయన సినిమా విడుదలైతే ఓ సంచలనం. ఆయన సినిమాలు రికార్డ్స్ బద్దలయ్యేలా కలెక్షన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఒక సాధారణ స్థాయి మెకానిక్ గా జీవితాన్ని ఆరంభించి వెండితెరపై పోటీగా ఎవరితోనైనా కూడా ఆట ‘ఆరంభం‘ అంటూ తలపడి విజయాల్ని పొందిన హీరో ‘తలా‘ అజిత్. నేడు అజిత్ కుమార్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికరమైన విషయాలు…
అజిత్ కుమార్ పుట్టింది మన తెలుగునాటే. అంటే ఆయన పుట్టిన స్థలం దృష్యా తెలుగువారే అన్నమాట. అజిత్ 1971, మే 1వ తేదీన సుబ్రహ్మణ్యం, సింధి దంపతులకు సికింద్రాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి కాగా తల్లి సింధి కలకత్తకు చెందిన వ్యక్తి. అజిత్ పదవ తరగతి వరకు చదివగా తర్వాత పరిస్థితుల కారణంగా చదువును మానేసి ఓ స్నేహితుడి ద్వారా కొంతకాలం రాయల్ ఎన్ ఫీల్డ్ లో మెకానిక్ గా పని చేశారు. కొడుకు మెకానిక్ గా పనిచేయండం అజిత్ నాన్నకి నచ్చకపోవడంతో మరొక స్నేహితుడి ప్రమేయంతో వస్త్ర ఎగుమతి సంస్థలో చేరారు. అక్కడ వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవడంతో పాటు ఇంగ్లిష్ లో మాట్లాడే నైపుణ్యం సంపాదించారు.తర్వాత కొన్నాళ్ళకి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన ముగ్గురు స్నేహితులతో కలిసి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా చేస్తున్న క్రమంలో మోడలింగ్ పై ఆకర్షితుడై మోడలింగ్ చేయడం మొదలు పెట్టారు అజిత్. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ అజిత్ ను గుర్తించి సినిమా రంగంవైపు అడుగులు వేసేలా మార్గ నిర్దేశం చేశారు. ఆ నాటి అతి సామాన్య అజిత్ కుమార్ నేడు అసామాన్య ‘తలా‘ అజిత్ గా తమిళనాట అగ్రహీరోగా రాణిస్తున్న మన తెలుగోడు.
సినీ రంగ ప్రవేశం – తొలి సినిమాకే మెగాస్టార్ ప్రోత్సాహం
పీ.సీ.శ్రీరామ్ సలహాతో సినిమా రంగంవైపు మళ్ళిన అజిత్ కు అవకాశాలు అంత సులువుగా రాలేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన అజిత్ అందరిలానే ముందు కొన్ని చిన్న చిన్న రోల్స్ చేశారు. తెలుగు సినిమా ద్వారానే అజిత్ హీరోగా పరిచయం అయ్యాడు. ప్రముఖ రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకుడిగా చేసిన ‘ప్రేమ పుస్తకం‘ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. సినిమా ఆరంభించిన కొన్నాళ్లకి దర్శకుడు మరణించడంతో మిగిలిన భాగాన్ని గొల్లపూడి మారుతీరావు పూర్తి చేశారు. ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో మంచి ఆదరణ లభించి హీరోగా అజిత్ కి మంచి గుర్తింపు తెచ్చింది. సినిమా పోస్టర్ పై కూడా ఈ విషయాన్ని చూడొచ్చు.
లవర్ బాయ్ టూ మాస్ హీరోగా తలా‘ :
ఆ తర్వాత తమిళ సినిమా రంగంవైపు మళ్ళీ అక్కడ మొదట్లో ఎన్నో విజయవంతమైన ప్రేమ కథా సినిమాల్లో నటించారు. అలా చేసిన ‘ఆసాయ్’ అనే సినిమా తర్వాత అజిత్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తన రెండో సినిమా ‘కాదల్ కొట్టాయ్’తో అజిత్ జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఎస్. జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలీ’ అనే సినిమాతో అజిత్ అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక అజిత్ వరుసగా నటించిన ఆరు సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంతో స్టార్ హీరో స్టేటస్ని సంపాదించుకున్నారు. ఆయన చేసిన ‘ప్రేమ లేఖ‘, ‘వాలీ‘, ‘ప్రియురాలు పిలిచింది‘, ‘ఆశ ఆశ ఆశ‘ వంటి తదితర సినిమాలతో సూపర్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు.
అప్పటి వరకు లవర్ బాయ్ గా అలరించిన అజిత్ ‘బిల్లా’ సినిమా ద్వారా సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్లో నటించి అభిమానులతో పాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తన 50వ చిత్రం ‘మన్కథ (గాంబ్లర్)’లో ఆయన తొలిసారిగా డిఫరెంట్ లుక్ లో కనిపించి అలరించారు. ఆ తర్వాత ‘ఆరంభం’, ‘వీరమ్’, ‘ఎంతవాడు గానీ’, ‘వేదాలం’, ‘వివేగం’ ‘విశ్వాసం’ వంటి వరుస మాస్ సినిమాలతో తమిళ నాట తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు అజిత్. ఈ సినిమాలు అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగునాట కూడా మంచి విజయం సాధించాయి.
షామిలీతో అజిత్ వివాహం :
‘అమర్కళం’ సినిమాలో ఆయన హీరోయిన్గా నటించిన షామిలీని అజిత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప జన్మించింది. ఇక హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ తమిళ రీమేక్ ‘నెర్కొండ పార్వాయ్’లో అజిత్ నటించారు. ఈ సినిమాని తెలుగులో ‘వకీల్ సాబ్‘ పేరిట పవన్ కళ్యాణ్ చేయటం విశేషం. గతంలోను అజిత్ చేసిన ‘వీరం‘ సినిమానే తెలుగులో ‘కాటమరాయుడు‘ గా నటించారు పవన్.
అజిత్ ‘ద రేసర్ & అవార్డ్స్ :
సినిమాల్లో ఎటువంటి డూప్స్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించే అజిత్. తెర మీదతో పాటు నిజజీవితంలోను రేసింగ్ చేస్తూ స్టంట్స్ చేస్తుంటారు. అలా యాక్టింగ్తో పాటు రేసింగ్లో అజిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసుల్లో పాల్గొన్న ఆయన అందులోనూ తన సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ వేదికగా ఫార్ములా కార్ రేసింగ్లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో ఆయన ఒకరు. దాదాపు 60 చిత్రాల్లో నటించిన అజిత్ తన సినిమా కెరీర్లో నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు.
అజిత్ ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. తన కెరీర్లో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ… ‘తలా‘ అజిత్ కు బర్త్ డే విషెష్ అందిస్తుంది మూవీ వాల్యూమ్.