బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఆయనొక సత్యజిత్ రే. సజీవమైన పాత్రలతో .. సునిశిత కథాంశాలతో.. సహజత్వం ఉట్టిపడే సన్నివేశాలతో .. మనసుని ఆనందడోలికల్లో తేలియాడించే పాటలతో .. విలువలు కలిగిన చిత్రాలెన్నిటినో తెరకెక్కించిన గ్రేట్ డైరెక్టర్ ఆయన. పేరు గురుదత్. ఆయన సినిమాలు ఇప్పటి తరం దర్శకులకు పాఠ్యాంశాలు. కొత్తగా అడుగుపెట్టే నటులకు ఆయన నటన ఒక కళాశాల.
గురుదత్ కేవలం ఒక అద్భుత నటుడే కాదు, మంచి రచయిత, నిర్మాత, దర్శకుడు కూడా. బెంగాలీ చిత్రసీమలో సత్యజిత్ రాయ్‌కి ప్రయోగాలు చేయడంలో, భావోద్వేగపు చిత్రాలు నిర్మించడంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నాయో, హిందీ చిత్రసీమలో గురుదత్ సినిమాలు కూడా అదే కోవకు చెందుతాయని సినీ పండితులు చెబుతుంటారు. యాభై దశకంలో నిర్మించిన గొప్ప చిత్రాల్లో గురుదత్ నిర్మించిన చిత్రాలకు తొలి పంక్తిలోనే స్థానం లభిస్తుందనే మాట అతిశయోక్తి కాదు . స్వాతంత్య్రానంతరం నిర్మితమైన సినిమాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వాటిని అమలు పరచిన అతికొద్ది నిర్మాతలలో గురుదత్ ఒకరు. బాలీవుడ్ క్లాసిక్స్ అనదగిన ‘ప్యాసా’, ‘కాగజ్ కే పూల్ ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’, ‘చౌద్వి కా చాందిని సినిమాలు గురుదత్ ప్రసాదితాలే! ముఖ్యంగా ‘ప్యాసా’, ‘కాగజ్ కే పూల్’ సినిమాలను అంతర్జాతీయ ‘టైమ్ మ్యాగజైన్’ 100 ఆల్ టైమ్ గ్రేట్ సినిమాల జాబితాలో చేర్చింది. ‘సైట్ అండ్ సౌండ్ క్రిటిక్స్ గురుదత్ పేరును ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫిలిం దర్శకుల’ జాబితాలో చేర్చింది. అంతేకాదు, సి.ఎన్.ఎన్ సంస్థ ‘ఆసియా ఖండంలోని టాప్ 25 దర్శకుల జాబితా’లో గురుదత్ పేరును ప్రకటించింది. నేడు గురుదత్ జయంతి. ఈ సందర్భంగా ఆ మహా నట, దర్శక, నిర్మాతకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.