అదృష్టం లేకపోతే ఎలా? అదృష్టం తర్వాతే ఏదైనా … మసిపూసి మారేడు కాయ చేసే ఈ సినిమా ప్రపంచంలో ఓ తారగానీ తారడుగానీ పైకి రావాలంటే … ముఖ్యంగా కావల్సింది అదృష్టమే అని ఘంటాపథంగా చెప్తాను. ఈ నాడు నాకు యిలా సుఖంగా రోజులు జరిగిపోతున్నాయంటే … అదంతా అదృష్టం చలవే …
ఈ మాటలు అన్నది తెలుగు తెర వీర గయ్యాళి ఛాయాదేవి.
గుంటూరు జిల్లాకు చెందిన ఛాయాదేవికి చిన్నప్పట్నించీ నాటకాల మీదా డాన్సు మీదా అభిరుచి. దురదృష్ట వశాత్తూ కుటుంబంలో సఖ్యత లేకపోవడంతో తన జీవితం తాను చూసుకోవాల్సి రావడం కూడా ఒక రకంగా అదృష్టమే.
పొట్ట పోసుకోడానికి తనకు తెల్సిన పనైతేనే మంచిది అనుకున్న ఛాయాదేవి ఓ సన్నిహితుడితో కల్సి విజయవాడ చేరింది.
అక్కడే స్టేజ్ మీద డాన్స్ చేయడం ప్రారంభించింది. అక్కడే నటనకీ శ్రీకారం చుట్టింది. అదృష్టం అలా కలిసొచ్చింది. పద్నాలుగేళ్ల వయసులో తెర మీద కనిపించే ఛాన్స్ వచ్చింది.
సినిమా పేరు దీనబంధు. ఎమ్మెల్ టాండన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఛాయాదేవికి తొలి చిత్రం కావడంతో పాటు మరో విశేషం కూడా ఉంది.
ఈ సినిమా కోసమే శంకరంబాడి సుందరాచారిగారు మా తెలుగు తల్లికీ మల్లెపూదండ రాశారు. అయితే ఆ పాట దర్శకుడికి నచ్చకపోవడంతో సినిమాలో వాడలేదు. కారణం .. అది సిట్యుయేషన్ కు తగిన విధంగా ఉండకపోవడమే … దీంతో సాహిత్యం నచ్చి విడిగా దాన్ని పాపులర్ చేశారు ఆ సినిమాలో నటించిన టంగుటూరి సూర్యకుమారి.
అలా ఛాయాదేవి నటించిన తొలి చిత్రమే ఓ చారిత్రాత్మక సందర్భంతో ముడిపడి ఉన్న చిత్రం కావడం అదృష్టమే కదా.
ఈ సినిమాలో నటించిన ఛాయాదేవికి నటించాననే తృప్తి తప్ప ఆ సినిమా ద్వారా వచ్చిన లాభం ఏమీ లేకపోయింది. తను అసంతృప్తి పడలేదు.
ఛాయాదేవి సినిమాల్లో ప్రవేశించిన ఓ నాలుగేళ్లకు అంటే సుమారు 1946 ప్రాంతాల్లో సూర్యకాంతం నారద నారది సినిమా ద్వారా ఇండస్ట్రీలో కాలుపెట్టింది.
విచిత్రమేమంటే సూర్యకాంతం కూడా డాన్స్ పాత్రతోనే పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం …
చంద్రలేఖ లో తనకు వచ్చిన అవకాశం డాన్స్ సన్నివేశాల కోసమే.
ఇలా సినిమాల మీద ఆశతో నాటకాలలో వచ్చిన సంపాదన ఆధారంతో అదృష్టం మీద భారం వేసి వేచి చూస్తున్న ఛాయాదేవికి ఆరేళ్ల తర్వాత గానీ బ్రేక్ రాలేదు. ఎన్టీఆర్ తీసిన పిచ్చిపుల్లయ్య సినిమాలో కాస్త ఆడియన్స్ కళ్లల్లో పడే పాత్ర దొరికింది ఛాయాదేవికి.
జమీందారిణి … పాత్ర ఆఫర్ చేశారు దర్శకుడు ప్రకాశరావు ఎన్టీఆర్ లు.
అలా ఛాయాదేవి నట జీవితం ఓ మలుపు తిరింది. కాస్త గట్టిగా పొగరు మూర్ఖత్వం కలగలసిన పాత్రలు రావడం మొదలైంది. సంసారం చిత్రంతో సూర్యకాంతానికి ఎలాగైతే గయ్యాళి పాత్రలు స్వాగతం పలికాయో అలాగే ఛాయాదేవికీ తెలుగు సినిమా పరిశ్రమ మరో తరహా గయ్యాళి పాత్రలతో స్వాగతం పలికింది…
సూర్యకాంతం గయ్యాళితనానికీ ఛాయాదేవి గయ్యాళి తనానికీ తేడా ఉంటుంది.
సూర్యకాంతం గయ్యాళితనంలో స్వార్ధం మూర్తీభవిస్తుంది తప్ప అందులో ఎక్కడో ఓ తెలియనితనం కనిపించి కాస్త జాలేసేలా నడుస్తుంది.
ఛాయాదేవి అలా కాదు విలనిష్ ట్రెండ్ బలంగా మిక్స్ అయిన గయ్యాళి పాత్రలే అధికంగా చేసింది.
సూర్యకాంతం పశ్చాత్తాపపడుతుంది జనం కూడా క్షమించేస్తారు. ఛాయాదేవి వేసే పాత్రలు అలా ఉండవు … పోలీసోళ్లు తీసుకెళ్లి సీరియస్ గా శిక్షిస్తే బావుణ్ను అని థియేటర్ లో ఉన్న ప్రేక్షకుడు కోరుకునేంతగా విలనీ చేసేస్తుంది తను.
ఇది మౌలికంగా సూర్యకాంతం నటనకీ ఛాయాదేవి నటనకీ ఉన్న తేడా.
కె.వి.రెడ్డి తీసిన మాయాబజార్ లో రేవతి పాత్రను ఛాయాదేవి పోషించిన తీరు అద్భుతం. సినిమా చివర్లో అందరూ శ్రీ కృష్ణుడు ఘటోత్కచుడు చేసిన మాయాజాలంతో అవాక్కైపోయి ఉన్న సందర్భంలో అవునూ నా కూతురేదీ అనడం ఆ ఎక్స్ ప్రెషన్ తల్లి హృదయాన్ని మొత్తానికి మొత్తం ఆవిష్కరించేస్తుంది.
చాలా ఇళ్లల్లో ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో పెద్దకోడళ్లకు నమూనాగా దర్శక రచయితలు ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరును పూర్తి స్థాయిలో అర్ధం చేసుకుని దాన్ని తన నటనలో ఆవిష్కరించిన అసమాన నటి ఛాయాదేవి.
గుండమ్మ కథ సినిమాలో తన గయ్యాళి తనంతో సంసారాన్ని సర్వనాశనం చేసుకున్న సూర్యకాంతం తోలు తీసి ఓ మూల గదిలో పారేసి తన ఆస్తి మొత్తాన్నీ తన హస్తగతం చేసేసుకునే టైపు పాత్రలో ఛాయాదేవి అదరగొట్టేస్తుంది.
దబాయింపు …. దౌర్జన్యం … నోరు పారేసుకోవడం ఇవన్నీ కామన్ గానే కనిపించినా ఈ తరహా వాళ్ల వ్యవహారంలో ఓ తెలియని దారుణమైన కుట్ర కోణం బలంగా కనిపిస్తుంది.
సూర్యకాంతంలో స్వార్ధం డామినేట్ చేస్తే ఛాయాదేవిలో ఈ కుట్ర కోణం బాగా ఎగ్జిబిట్ అవుతుంది.
వీళ్లిద్దరి గొప్పతనం ఏమిటంటే … ఒకే తరహా పాత్రలు వందల సినిమాల్లో పోషించడం …
ఛాయాదేవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పాత్రలు అనేకం చేసినా దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తుంది…
ఛాయాదేవి వ్యక్తిగత జీవితం కూడా సూర్యాకాంతం అంత సాఫీ కాదు.
పిల్లలు లేరు. సినిమాల్లోకి వచ్చేప్పుడూ అంతకు ముందు బెజవాడ రంగస్థలం మీదకు వెళ్లినప్పుడు ఒక మగతోడు ఉండాడని తీసుకెళ్లిన వ్యక్తి తో తనది వైవాహిక బంధం కాదు.
మహానటుడు ఎస్వీఆర్ తో ఆవిడ స్నేహం మీద ఇండస్ట్రీలో చాలానే మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటారు కూడా అది పూర్తిగా ఆవిడ వ్యక్తిగతం.
ఇలా చిన్నప్పుడే తను అనుకున్న పద్దతిలో జీవితం ప్రారంభించిన వాళ్లల్లో ఉండే ప్రపంచాన్ని చదివిన తనం ఛాయాదేవిలోనూ పుష్కలంగా కనిపించేది. అయితే అది అతి తెలివిగా పరిణమించకుండా లెక్కలేని తనంగా మారింది.
తను ఎటువంటి పరిస్థితులనైనా డోంటే కేర్ అనుకునేది.
ఎవరైనా జీవితంలో దెబ్బతింటే వాళ్లకు కాస్త తనకు తోచిన పద్దతిలో ఆసరా ఇచ్చే ప్రయత్నం చేసేది. అందులో కూడా తెంపరితనమే.
ఇలా జీవన విధానంలోనూ సూర్యకాంతానికి సమాంతరమే ఛాయాదేవి.
ఇద్దరూ ఒకరికొకరు ప్రత్యామ్నాయం కాదు … ఎవరి పాత్రలు వారివే … ఎవరి నటన వారిదే … కొన్ని లక్షణాలు కలుస్తాయి అంతే…. దీన్నే జీవన వైవిధ్యం అంటాం …
సూర్యకాంతంలో భోళాతనం గురించి ఎలా ఇండస్ట్రీలో సీనియర్లు మాట్లాడుకుంటారో అలాగే ఛాయాదేవిలో ఉన్న పెట్టే లక్షణం గురించీ చెప్పుకుంటారు.
అయితే సూర్యకాంతం తో ఎటాచ్ అయినట్టు ప్రపంచం ఛాయాదేవితో అటాచ్ కాలేదు. నటిగా ఛాయాదేవిని అదరించినా ఏ కారణంగానో సూర్యకాంతంకి ఇచ్చిన స్థానం అయితే ఇవ్వలేదు.
పరిశ్రమే కాదు మీడియా సైతం … ఛాయాదేవికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించదు.
ఛాయాదేవి ఇంటర్యూలు గానీ ఆవిడ పై ప్రత్యేక కథనాలు గానీ చాలా అరుదే … అందరు హీరోల సినిమాల్లోనూ నటించింది. సుమారు మూడు వందల సినిమాల వరకూ నటించిన ఛాయాదేవి కూడా చివరి రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడింది సూర్యకాంతంలానే.
వేలికి దెబ్బ తగిలి కాలు తీసేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.
వృద్దాప్యం ఒంటరితనం కారణంగా తనకు రావాల్సిన డబ్బు రాబట్టుకోలేకపోయింది. వడ్డీలకు ఇచ్చిన డబ్బులకు తిలోదకాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
సంపాదించిన ఆస్తులు అన్యాక్రాంతం అయినా నోరు మెదపలేని స్థితి.
అలా అన్నీ ఉండీ దరిద్రంలోకి జారిపోయి అయ్యో పాపం అనిపించే పరిస్థితుల్లో 1983 సెప్టెంబర్ నాలుగో తేదీన ఈ లోకాన్ని వీడింది.
చిత్రంగా ఛాయాదేవి చనిపోయిన వార్తను సైతం ఏవో కొన్ని సినిమా పత్రికలు తప్ప పట్టించుకోలేదు.
ప్రత్యేక కథనాలు ప్రచురించలేదు.
ఆవిడ జీవితంలోని చీకటి కోణాల గురించి ప్రపంచం ముందు పెట్టేంత పని కూడా భుజాన వేసుకోలేకపోయాయి.
ఎందుకంత వ్యతిరేకత … ఎందుకంత చులకన అంటే అనేక సమాధానాలు తడతాయి… ఛాయాదేవి జీవితంలో ఉన్న తెంపరితనం మీద సమాజం తీర్చుకున్న కక్షగా చూడాలనిపిస్తుంది.
ఎన్నో సినిమాలు సాధించిన విజయాలకు ఆవిడా కారణమే. రచయితలు సృష్టించిన ప్రత్యేక ప్రకృతి ప్రవృత్తి గల పాత్రలకు ప్రాణం పెట్టి ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రతిభ ఛాయాదేవిది.
అయినా సూర్యకాంతానికి దక్కిన గౌరవ మర్యాదలు … దక్కలేదనే చెప్పాలి.
ఛాయాదేవి ప్రతిభ చాలా గొప్పదేగానీ … తన పేరులో ఉన్నట్టుగానే నీడల్లోనే నడచిపోవాల్సివచ్చింది.
సూర్యకాంతం లా సూర్య ప్రభతో వెలిగిపోలేకపోయింది.
అలా పరిశ్రమలో వాడుకోవడంలో కాదుగానీ … పట్టించుకోవడంలో మాత్రం తీవ్రమైన నిరాదరణకు గురైన నటి ఛాయాదేవి. దీనిలో సమాజం పాటిస్తున్న విలువల ప్రభావం బలంగా ఉండవచ్చు …
ఇప్పటికైనా ఛాయాదేవి జీవితంపైనా తన నటనపైనా తను పోషించిన పాత్రలపైనా సమగ్రమైన అధ్యయనం జరగాల్సి ఉందని మాత్రం చెప్పకతప్పదు.
అందుకు ఏ మాత్రం దోహదపడినా ఈ రచన లక్ష్యం నెరవేరినట్టే భావిస్తాను.
Writer – Bharadwaja Rangavajhala