పాత్రపోషణలో మంచి చెడ్డల ఉమ్మడి… నానాటికీ తనకు తానే వరవడి.. నటనలో దిద్దుకుంటున్నాడు ఒక్కుమ్మడి.. నేత్రపర్వంగా రచిస్తాడు శ్రీ గుమ్మడి .. అని బాపు, రమణలు .. గుమ్మడి గురించి, ఆయన సహజ నటన గురించి ఏనాడో తమ అభిప్రాయాన్ని చెప్పేశారు. తెలుగు చలన చిత్రసీమలో ఒక అద్భుత నటుడుగా అరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి ఇదు వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు  గుమ్మడి వెంకటేశ్వరరావు.

చిన్నప్పటి నుంచీ నాటకాల మీద ఎనలేని మక్కువ గుమ్మడికి. ఎన్నో నాటకాల్ని అతి తక్కువ వయసులోనే ప్రదర్శించి.. ఉత్తమ నటుడు అనిపించుకున్నారు. ఆ ప్రతిభే ఆయన్ను చలన చిత్ర రంగం వైపుకు నడిపించింది. గుమ్మడి సినీ రంగ ప్రవేశం అదృష్ట దీపుడు  సినిమాతో జరిగింది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి, అవకాశాలు లేవని, తిరిగి వెళ్ళాలని భావించిన సమయంలో, ఎన్.టి. రామారావుతో కలిగిన పరిచయం వలన ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్ళవద్దని, తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేసారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్.టి. రామారావు ఆయనకి  తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చారు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఎన్.టి.రామారావు తన తరువాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడుదొంగలుగా అయన, ఎన్.టి.రామారావు నటించారు. ఆ చిత్రం విజయం సాధించక పోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం.

ఎన్నో అత్యద్భుతమైన పాత్రలు గుమ్మడిని వరించి తరించాయి. ఇటు విలన్ గానూ, అటు కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ  నటిస్తూ..  తన నటన రెండు వైపులా పదునున్న కత్తి అని నిరూపించుకున్నారు. గుమ్మడి ఎక్కువగా అన్నపూర్ణ, జగపతి, ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్, పద్మశ్రీ వంటి సంస్థల్లో అక్కినేని సినిమాలలో నటించారు.   ‘వాగ్దానం’లో తేనె పూసిన కత్తిలాంటి విలన్‌గా, ‘భీష్మ’లో కర్ణుడుగా, ‘కానిస్టేబుల్‌ కూతురు’లో కానిస్టేబుల్‌గా, ‘ఇద్దరు మిత్రులు’లో విలన్‌గా, ‘కులగోత్రాలు’లో అక్కినేని తండ్రిగా, ‘చదువుకున్న అమ్మాయిలు’లో రంగయ్యగా, ‘లక్షాధికారి’లో విలన్‌గా, ‘మూగ మనసులు’, ‘పునర్జన్మ’, ‘అంతస్తులు’ చిత్రాలలో జమీందారుగా, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో ధర్మరాజుగా, ‘పూజాఫలము’లో దివాన్‌ రామకృష్ణయ్యగా, ‘ప్రేమించిచూడు’లో జగ్గయ్య తండ్రిగా, ‘రహస్యం’లో శ్రీగంధ ప్రభువుగా, ‘బంగారు గాజులు’లో చంద్రశేఖరంగా, ‘గోవుల గోపన్న’లో చైర్మన్‌ నాగరాజుగా, ‘పూలరంగడు’లో చలపతిగా, ‘సంపూర్ణ రామాయణం’లో దశరథుడుగా, ‘పండంటికాపురం’లో కార్మిక నాయకుడుగా, ‘తాత-మనవడు’లో పరమాత్మరావుగా, ‘సోగ్గాడు’లో సింహాద్రిగా, ‘కురుక్షేత్రం’లో భీష్ముడుగా, ‘దాన వీర శూర కర్ణ’లో పరశురాముడుగా, ‘మరోమలుపు’ లో ఛాందస బ్రాహ్మడుగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ చదువులు మాకొద్దు’లాంటి సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో, ‘పెళ్ళిపుస్తకం’ లో కంపెనీ యజమానిగా ఇలా అనేక పాత్రల్లో అప్రతిహతంగా 1996 వరకు గుమ్మడి నటించారు. 1998లో గుమ్మడికి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. నేడు గుమ్మడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!