ఆకట్టుకొనే రూపం.. ఆకర్షించే కళ్ళు.. కోటేరు ముక్కు… చక్కటి చిరునవ్వు కలగలిస్తే గుమ్మడి వెంకటేశ్వరావు. సహజ నటనకు పెట్టింది పేరు. తెలుగు తెరపై ఇప్పటివరకూ అత్యధికంగా తండ్రి పాత్రలు పోషించిన ఆయన .. కన్నింగ్ విలన్ పాత్రలకూ బాగా ప్రసిద్ధి. గుమ్మడి తెనాలి ప్రాంతానికి చెందిన రంగస్థల నటుడు. మంచి భాష.. స్పష్టమైన ఉచ్ఛారణ కలిగి ఉండడం వల్ల సినిమా ప్రయత్నాలు సాగించారు. ‘అదృష్ణదీపుడు’ తో ఆయన సినీ జీవితం ఆరంభమైనా ‘అర్థాంగి’ నుంచి అదృష్టం అందుకుంది. పౌరాణికాలు, సాంఘీకాలు, ఆయన్ని వరించాయి. ‘కారెక్టర్ యాక్టర్’కి నిర్వచనం చెప్పారు గుమ్మడి. ‘క్యారెక్టర్ ముందుండాలి. యాక్టర్ వెనకాల వుండాలి’ అని! ఆయన అభిరుచి గొప్పది. అసభ్యత, అశ్లీలం అసలు ఇష్టపడేవారు కాదు.
ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు తెరపై తన అభినయ కౌశలాన్ని ప్రదర్శించిన గుమ్మడి.. ఐదు దశాబ్దాలకు పైగా నటించి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు ను అందుకున్నారు. దాదాపు 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించారు . ఎన్ టి ఆర్ తో నటించిన ‘తోడు దొంగలు , మహామంత్రి తిమ్మరుసు’ సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడుగా ఎంపికయ్యారు. మాయా బజార్ , మా ఇంటి మహాలక్ష్మి , కులదైవం , కుల గోత్రాలు , జ్యోతి , నెలవంక , మరో మలుపు , ఏకలవ్య , ఈ చరిత్ర ఏ సిరాతో? , గాజు బొమ్మలు , పెళ్ళి పుస్తకం , గుమ్మడికి మంచి పేరు తెచ్చిన చిత్రాలు. తెలుగు విశ్వవిద్యాలయం ‘మహామంత్రి తిమ్మరుసు’ లో కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. నేడు గుమ్మడి వర్ధంతి. ఆ మహానటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.