అప్పుడప్పుడే తెలుగు సినిమా మూకీల నుంచి టాకీలకు మారుతోన్న సమయమది. పౌరాణిక ఇతివృత్తాలకే పెద్ద పీట వేసి..దాన్నే సినిమాగా ప్రాచారం సాగిస్తోన్న వేళ.. కొందరు అభ్యుదయ వాదులు ముందుకొచ్చి.. వారి అభిరుచి మేరకు తెలుగు సినిమా దశ, దిశను మార్చేశారు. సాంఘిక సమకాలిక సమస్యల్ని కథాంశాలుగా మలిచి.. నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపారు. అలాంటి వారిలో గూడవల్లి రామబ్రహ్మం ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే.. తెలుగుతెరను అభ్యుదయ పథంలో నడిపిన తొలి దర్శకుడు ఆయనే. అందుకే ఆయనకి తెలుగు సినీ వైతాళికుడు అని పేరు.
గూడవల్లి స్వస్థలం నందమూరు. సారధి చిత్ర పేరుతో ఆయన చిత్ర నిర్మాణ సంస్థ ని స్థాపించి కొన్ని చిత్రాలకు తానే దర్శకత్వం వహించారు. సినిమా హాళ్లలోకి వచ్చే ప్రేక్షకుల మదిలో ఆలోచనలు రేకెత్తించే మంచి చిత్రాలు రూపొందించాలన్నదే ఆయన నిబద్దత. ఈ నిబద్దత ని తన ప్రతి చిత్రంలోనూ పాటించారు. ఆ తర్వాత సినిమా ప్రపంచంలోకి వచ్చిన ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యారు. సారధి చిత్ర ద్వారా ఆయన కనకతార ని నిర్మించి, ద్రౌపది వస్త్రాపహరణం చిత్రానికి నిర్మాత బాధ్యతలతో పాటు దర్శకత్వాన్ని కూడా నిర్వర్తించారు. . ఆ తర్వాత ఆయన మరో నిర్మాత పి.వి. దాస్ తో కలసి శ్రీ కృష్ణ లీలలు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 1938లో మాలపిల్ల, 1939లో రైతు బిడ్డ, 1940లో ఇల్లాలు, 1941లో అపవాదు, 1942లో పత్ని, 1943లో పంతులమ్మ, 1945లో మాయలోకం సినిమాలకు దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం పల్నాటి యుద్ధం నిర్మాణం ప్రారంభించినా ఆ సినిమా పూర్తి కాకుండానే ఆయన మరణించారు. దాంతో మరో దర్శకుడు ఎల్. వి . ప్రసాద్ ఆ చిత్రాన్ని పూర్తి చేయగా విడుదలకు నోచుకుంది. స్వాతంత్రోద్యమ కాలంలో పుట్టి…స్వతంత్రాన్ని చూడకుండానే కన్ను మూసిన గూడవల్లి రామబ్రహ్మం అప్పటికీ, ఇప్పటికీ… తెలుగు సినిమా ఉన్నంత చిరస్మరణీయుడు. నేడు గూడవల్లి రామబ్రహ్మం జయంతి. ఈ సందర్భంగా ఆ మహాదర్శకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.