అందమైన ముఖం.. ఆకట్టుకొనే కళ్ళు.. ఆకర్షించే రూపం.. సన్నజాజి తీగెలాంటి శరీరం… చిరునవ్వు చిందించే మోము. ఇటు అందానికి, అటు అభినయానికి సరైన ప్రధాన్యత నిచ్చే ఆ సుందరి పేరు గౌతమి. పదహారణాల తెలుగమ్మాయి. పైగా విశాఖపట్నం వాసి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. విజయ్ చందర్  ‘దయామయుడు’  ఆమె నటించిన మొదటి సినిమా . కానీ విడుదలైనది  మాత్రం రాజేంద్రప్రసాద్ ‘గాంధీనగర్ రెండవ వీధి’.

ఇక   ‘గురు శిష్యన్’ సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించింది గౌతమి . తొలి ప్రయత్నంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం అందుకోవడం విశేషం.  ఆ సినిమా సూపర్ హిట్టవడంతో .. అక్కడ ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి. ఒకానొక దశలో కోలీవుడ్ లో  అప్పటి కథానాయికలకు గట్టి పోటీనిచ్చింది గౌతమి. తెలుగు, తమిళ, మలయాళ , కన్నడ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన గౌతమి… సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మంచి సినిమాలు చేస్తోంది. నాలుగేళ్ళ క్రితం కమల్ హాసన్ పాపనాశం చిత్రంతో తమిళ రీఎంట్రీ ఇచ్చిన గౌతమి…. ప్రస్తుతం విశాల్ నటించిన ‘తుప్పరివాలన్ 2’ లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. ఇంకా మరిన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషిస్తూ సత్తాచాటుకుంటోంది. నేడు గౌతమి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!