ఆయనకి దర్శకుడిగా సెల్యులాయిడ్ పై అందమైన చిత్రాలు తెరకెక్కించడం తెలుసు… అద్భుతమైన పాత్రలతో కథాకథనాల్ని రచించడం తెలుసు.. ఛాయాగ్రహణంతో దృశ్యకావ్యాలు సృజియించడం తెలుసు.. శ్రావ్యమైన స్వరాలతో శ్రుతి శుద్ధమైన సంగీతాన్ని అందించడం తెలుసు. ఇన్ని శాఖల్ని అతి సమర్ధవంతంగా నిర్వహించే ఆ దర్శకుడి పేరు గౌతమ్ ఘోష్. బెంగాలీ ప్రేక్షకులు కళాత్మక, సమస్యాత్మక చిత్రాలను ప్రోత్సహిస్తారు కనుకనే గౌతమ్ ఘోష్ ఎక్కువగా బెంగాలీ భాషలోనే చిత్రాలు తెరకెక్కించారు.
గౌతమ్ ఘోష్ కలకత్తాలోజన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ పట్టా అందుకున్నారు. కొంతకాలం ఫోటో జర్నలిస్టుగా పనిచేశారు. కలకత్తాలో గ్రూప్ థియేటర్ మూవ్మెంట్‌లో చురుకైన పాత్రను పోషించారు. చైన్స్ ఆఫ్ బాండేజ్’ అనే డాక్యుమెంటరీ నిర్మించిన తరువాత బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కిషన్ చందర్ రచించిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఆధారంగా నిర్మాతలు బి. నరసింగరావు, జి.రవీంద్రనాథ్ 1980లో చైతన్య చిత్ర ఇంటర్ నేషనల్ బ్యానర్ మీద ‘మాభూమి’ చిత్ర నిర్మాణానికి నడుంబిగించారు. తెలంగాణలో ప్రబలుతున్న ఫ్యూడల్ వ్యవస్థను ఎండగడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా కార్మికులు చేసిన ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. మాభూమి చిత్రం 1980 కార్లోవి వరీ చలనచిత్రోత్సవంలో భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఆ తర్వాత గౌతమ్ ఘోష్ అద్భుతమైన ఎన్నో బెంగాలీ చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయనకు లఘు బడ్జెట్ చిత్రాలు నిర్మించడమన్నా, డాక్యుమెంటరీలు తీయడమన్నా చాలా మక్కువ. ‘మహాయాత్ర’, ‘సంగే మీల్ సే ములాకాత్’, ‘మొహోర్’, ‘ది బర్డ్ ఆఫ్ టైమ్’ డాక్యుమెంటరీలు నిర్మించారు. నేడు గౌతమ్ ఘోష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.