గుండ్రటి ముఖం.. ఉంగరాల జుట్టు.. చక్కటి చిరునవ్వు. వీటికి తోడు హ్యాండ్ సమ్ లుక్స్. అదే ఫేస్ కట్ తో ఆయన .. విలన్ గానే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆయన పేరు ఎర్రా శేషగిరిరావు.  స్ర్కీన్ నేమ్  గిరిబాబు. నాలుగు దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరపై దాదాపు 600 చిత్రాలకు పైగానే నటించి మెప్పించారు. ఏకంగా పది చిత్రాల్ని నిర్మించారు. నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, హాస్యనటుడిగా, కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కథకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా…ఇలా అనేక రకాలుగా తన సృజనని ఆవిష్కరించుకున్న ప్రతిభావంతుడు గిరిబాబు. ఆంధ్రదేశంలో ఎక్కడో మారుమూల పల్లెలో అతి సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన గిరిబాబుకు చిన్నప్పటినుంచీ నాటలకాలంటే చెప్పలేని ఆసక్తి. ఆ మక్కువే ఆయన్ను సినీరంగంవైపుకు ఆకర్షించింది.

1973లో ‘జగమే మాయ’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన గిరిబాబు నాలుగుదశాబ్దాల కాలంలో సుమారు 6 వందల సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో నాయకుడిగా, మరికొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడిగా, హాస్యనటుడిగా, కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా…ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. కష్టించి పనిచేశారు. ఫలితం అందుకున్నారు. ప్రతి అవకాశాన్ని ఆనందంగా స్వీకరించానని… హీరోగానే కొనసాగాలని భీష్మించుకు కూచోలేదని…అదే తన విజయ రహస్యమని యర్రా శేషగిరిరావు ఎలియాస్‌ గిరిబాబు చెప్పుకుంటారు. గిరిబాబుకు రఘుబాబు, బోసు బాబు అని ఇద్దరు తనయులు. అందులో పెద్ద కొడుకు రఘుబాబు.. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా స్థిరపడ్డారు. రెండో కొడుకు బోసుబాబు .. హీరోగా రాణించాలని అనుకున్నా.. కాలం కలసిరాలేదు. ఇంద్రజిత్ అనే ఒకే ఒక సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..  ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించలేదు. నేడు గిరిబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!