‘యమలీల’ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, మనీషా ఫిల్మ్స్ సంస్థ చేసిన మరో ప్రయత్నమే సోషియో ఫాంటసీ మూవీ ‘ఘటోత్కచుడు’. కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా 1995, ఏప్రిల్ 27న విడుదలై పర్వాలేదనిపించుకుంది. నేటికి సరిగ్గా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా లోనూ ఆలీ హీరోగా నటించాడు. అంతేకాదు అతడి సరసన రోజా కథానాయికగా నటించి మెప్పించింది. కురుక్రేత్ర యుద్ధంలో గాయపడిన ఘటోత్కచుడు ఒక అడవుల్లో పడి ఉంటాడు. అతడికి ఒక కోయ బాలిక తాగడానికి మంచి నీరు అందిస్తుంది. చేసిన సహాయానికి కృతజ్నతగా ఆమెకు సహాయం చేసే ఒక వరం ప్రసాదిస్తాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ బాలిక ఒక ధనవంతుల ఇంట్లో జన్మిస్తుంది. ఆస్తి కోసం ఆమె తల్లిదండ్రుల్ని చంపేస్తారు కొందరు దుష్టులు. చివరికి ఆమెను కూడా చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడామె హీరో ఆలీ పంచన చేరుతుంది. క్లైమాక్స్ లో ఆమెను చంపాలని చూసిన వారికి ఘటోత్కచుడు బుద్ధి చెప్పడమే చిత్రకథ.
కథ సోషియో ఫాంటసీ అయినా.. దర్శకుడు కృష్ణారెడ్డి ఈ సినిమాను తనదైన శైలిలో పక్కా కామెడీ చిత్రంగా దీన్నిమలిచారు. ఇక ఇందులో ఏవీయస్ వెరైటీ విలనిజం ప్రదర్శించారు. రంగుపడుద్ది అనే మ్యానరిజమ్ తో నవ్వులు పూయిస్తారు. యస్వీ కృష్ణారెడ్డి సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూత లూగించాయి. , జ జ జ్జ రోజా.. ప్రియ మధురం.. భం భం భం.. అందాల అపరంజి బొమ్మ.. భామరో నన్నే ప్యార్ కరో.. డింగు డింగు.. పాటలు ఎంతగానో అలరించాయి. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ ఒక పాటలో కేమియో అపీరెన్స్ చేశారు.