అక్కినేని నాగార్జున కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘ఘరానా బుల్లోడు’ ఒకటి. ఆర్.కే.ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1995, ఏప్రిల్ 27 న విడుదలై ఘన విజయం సాధించింది. సరిగ్గా నేటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో జట్కా రాజు గా నాగ్ నటన ఆకట్టుకుంటుంది. ఏఎన్నార్ ‘పూలరంగడు’ చిత్రానికి మోడ్రన్ వెర్షన్ గా అనిపించే ఈ సినిమాలో రమ్యకృష్ణ, ఆమని కథానాయికలు గా నటించారు. ఇంకా శ్రీహరి, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, నూతన ప్రసాద్, జయచిత్ర, జయంతి, సుధ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూత లూగించాయి. ముఖ్యంగా భీమవరం బుల్లోడా పాలు కావాలా, రైక చూస్తే రాజమండ్రి, అదిరిందిరోయ్ .. పాటలు అయితే.. మాస్ కు పూనకాలు తెప్పించాయి. తన కుటుంబం మీద పడిన మచ్చను తుడిచేసి.. తన వారిని ఒకటి చేసే ఒక జట్కా యువకుడి కథతో ఘరానా బుల్లోడు చిత్రం తెరకెక్కింది. దర్శకేంద్రుడు తనదైన బాణీలో ఈ సినిమాని కమర్షియల్ గా తెరకెక్కించి.. సత్తా చాటుకున్నారు. సుర్రు సుమ్మైపోద్ది అనే ఊతపదంతో అదరగొట్టిన నాగ్.. మాస్ జనానికి ఘరానా బుల్లోడు అయిపోయాడు.