అందమైన రూపం.. చిరునవ్వులు చిగురించే ముఖం.. చక్రల్లాంటి కళ్ళు.. చిలిపి భావాలు పలికించే చూపు. ఆకట్టుకునే అభినయం.. ఆకర్షించే ఆంగికం. ఒకప్పటి దక్షిణాది తెరపై ఒక వెలుగు వెలిగిన అందం ఆమెది. పేరు గీత. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో లెక్కకు మించిన చిత్రాల్లో అగ్రకథానాయకుల సరసన నటించి మెప్పించిందామె. బెంగళూరు లో జన్మించినా.. ఆమె మలయాళ, తమిళ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది.
భైరవి అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది గీత . అందులో హీరో రజనీకాంత్ కు చెల్లెలుగా నటించింది. అప్పటి నుండి సుమారు 200కు పైగా అన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో, కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. ఈమె కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఈమెకు రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఒక కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు, ఒక కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు లభించాయి. 1980వ దశకంలోను, 90వ దశకం మొదటిలోను అన్ని దక్షిణాది భాషల్లోనూ దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన నటించి.. దక్షిణ భారతదేశపు అందమైన కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. 1997లో ఈమె వాసన్ తథమ్ అనే చార్టెడ్ అకౌంటెంట్‌ను పెళ్ళి చేసుకుంది. అనంతరం ఈమె కొన్నాళ్ళపాటు నటనకు స్వస్తి చెప్పి భర్తతో అమెరికాలోని న్యూజెర్సీలో నివసించింది. తర్వాత కొన్నేళ్లకు సినీరంగ పునఃప్రవేశం చేసి తల్లిపాత్రలు వంటి సహాయ పాత్రలలో నటిస్తున్నది.