Gamechanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్నట్లు తాజా సమాచారం. సంగీత దర్శకుడు తమన్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
తమన్ తన పోస్ట్ లో, “వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకూ ఈవెంట్స్, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి” అని అభిమానులకు తెలియజేశారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందంతో మురిసిపోతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, “నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ‘గేమ్ ఛేంజర్’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం” అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 50వ చిత్రంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.