గీతానంద్‌, నేహా సోలంకి జంటగా కస్తూరి రవి నిర్మాణంలో దయానంద్ డైరెక్షన్‌ చేసిన మూవీ ‘గేమ్‌ ఆన్‌’. ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌ లతో మంచి బజ్‌ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 2 న అనుకున్నట్టుగానే రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా ఈ రివ్యూలో చూద్దాం.

కథ – గౌతమ్‌ సిద్దార్ధ్‌ ( గీతానంద్) గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తుంటాడు. తన ఫ్రెండ్ (కిరీటి ) ప్రేయసి ( వాసంతి కృష్ణన్) లు తప్ప ఈ లోకంలో బంధువులంటూ ఎవరూ ఉండరు. అయితే వీరిద్దరు కూడా గౌతమ్‌ని వెన్నుపోటు పొడుస్తారు. దాంతో చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ టైమ్‌లో ఓ గేమ్‌ ఆడితే లక్ష రూపాయలు వస్తాయని ఫోన్‌ వస్తుంది. ఆ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ.. చివరకు మర్డర్స్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అనాధ అనుకున్న హీరోకు తన వాళ్లు ఎవరో తెలుస్తారు. ఆ ఫోన్ ఎవరు చేసారు ? ఆ గేమ్‌ ఏంటి ? ఆడించేది ఎవరు ? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : బ్లూవేల్‌, పబ్‌జీ లాంటి గేమ్స్ పిల్లలని ఎంత అడిక్ట్‌ చేసాయో చెప్పనక్కర్లేదు. వీటి మోజులో పడి పిల్లలు ప్రాణాలు తీసుకున్నవారు తీసిన వారు కూడా ఉన్నారు. ఇంతలా ఎడిక్ట్ చేసే గేమ్స్‌ ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమా కథ తయారు చేసి ఉండొచ్చు. గేమ్‌ లో భాగంగా హీరో టాస్క్‌లు ఆడుతూ డబ్బులు సంపాదించడం.. అటు నుంచి హత్యలు చేస్తే డబ్బులు రావడం ఇదంతా లాజిక్‌ కి కాస్త దూరంగా ఉన్నా పకడ్బంధీగా చిత్రీకరించారు. గేమ్‌లో భాగంగా ఆడే టాస్కులు ఇంట్రస్ట్‌ క్రియేట్ అయ్యేలా మొదలుపెట్టాడు దర్శకుడు. కొన్ని టాస్క్‌ల తర్వాత మాత్రం క్లారిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ వేగం పుంజుకుంటుంది. ఈ కథ ఇంట్రస్ట్‌గా అనిపించినా.. స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త పకడ్బంధీగా అల్లుకుంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే హీరో గీతానంద్ రెండో సినిమాకి నటనలో పరిణితి కనిపించేలా నటించాడు. ఉన్న ఆరు యాక్షన్ బ్లాక్స్ లో కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చేతకాని ఒక యువకుడిగా అదే సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగిన యువకుడిగా కూడా రెండు భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నేహా సోలంకి అటు గ్లామర్ ఒలకబోస్తూనే తన పాత్రలో నటనను కూడా మిస్ అవ్వకుండా చూసుకుంది. వాసంతి పాత్ర చిన్నది అయినా ఆమె కూడా గ్లామర్ డాల్ లాగా అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఆదిత్య మీనన్ విలన్ గా డామినేటింగ్ క్యారెక్టర్ లో కనిపించాడు. తనదైన టిపికల్ వాయిస్ తో ఆకట్టుకున్నాడు. శుభలేఖ సుధాకర్, మధుబాల వంటి వాళ్ళ అనుభవం స్క్రీన్ మీద కనిపించింది. ఇక టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి యాప్ట్ అనిపించింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి, ఆ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు అనిపించింది.
ఫైనల్ గా గేమ్ ఆన్.. ఓ కొత్త అటెంప్ట్
రేటింగ్ – 3 / 5

Leave a comment

error: Content is protected !!