తమిళ ప్రేక్షకులకు ఈ ఇద్దరు నటదిగ్గజాలు రెండు కళ్ళు. అందులో కమల్ క్లాస్ అయితే .. రజనీ పక్కా మాస్. ఈ ఇద్దరినీ అలా ఒకే స్ర్కీన్ మీదకు ఎక్కించి.. ఆపై జనానికి వెర్రెక్కించిన దర్శకుడు భారతిరాజా. ఆయన మొదటి చిత్రం ‘పదునారు వయదినిలే’ చిత్రంలోది ఈ స్టిల్ . అసలు భారతిరాజాకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే..అందరూ ఆశ్చర్యపోతారు.
సినిమా మీద పాషన్ తో మలేరియా డిపార్ట్ మెంట్లో చిన్న ప్రభుత్వోద్యోగాన్ని వదిలేసి మరీ చెన్నై వెళ్లిపోయాడు చిన్నస్వామి. రంగస్థలం మీద నటనానుభవం ఉంది. దాంతో పి.పుల్లయ్య, పుట్టణ్ణ కణగల్ లాంటి దర్శకుల దగ్గర పనికి కుదిరాడు. ఆ చిన్నస్వామే భారతిరాజా. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూనే.. దర్శకుడిగా ప్రయత్నాలు ప్రారంభించిన భారతిరాజా.. ఒక రోజు కొందరు ప్రొడ్యూసర్లను కలిసి తన దగ్గరున్న ఓ లవ్ స్టోరీ స్ర్కిప్ట్ వినిపించారు. వారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో నిరాశగా వెనుదిరిగిన ఆయనకి ఒక లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు. లారీ ఎక్కిన ఆయన ఎంతో ముభావంగా ఉన్నారు. లారీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎందుకలా ఉన్నావని లారీ డ్రైవర్ భారతిరాజాను అడిగాడు. దానికి తన సినిమా గురించి చెబుతూ.. వినిపించిన కథకు స్పందించని నిర్మాతలు గురించి చెప్పారు. అప్పుడు ఆ లారీ డ్రైవర్ ఆ కథను తనకు వినిపించమన్నాడు. భారతీరాజా డ్రైవర్ కు కథ చెప్పారు. కథ విన్న లారీ డ్రైవర్ షాకవుతూ.. ఇంత మంచి కథను సినిమాగా తీయలేనివారు నిర్మాతలు కాదని చెబుతూ.. సినిమాకి ఎంత ఖర్చవుతుందని అడిగాడు. భారతిరాజా బడ్జెట్ వివరాలు చెప్పారు. కట్ చేస్తే ఆ లారీ డ్రైవర్ తనకున్న మూడు లారీల్ని అమ్మేసి మరీ ఆ సినిమా ను ప్రొడ్యూస్ చేశారు. ఆయన పేరు యస్.యస్.రాజకణ్ణు. ఆ సినిమా పదునారు వయదినిలే. ఆ సినిమాతో ఆ లారీ డ్రైవర్ కోటీశ్వరుడై పోయి.. కోలీవుడ్ లో మరికొన్ని సినిమాలు తీశాడు. సో.. కొత్త గా కథ చెప్పిన ఏ ఒక్కరినీ తక్కువ చేయకూడదని , ఏ పుట్టలో ఏ పాముంటుందో తెలియదు కాబట్టి.. వారు చెప్పే దాన్ని ఓపిగ్గా వింటే.. భారతిరాజా లాంటి గొప్ప దర్శకుల్ని వెలుగులోకి తీసుకురావచ్చని ఈ ఉదంతంతో రుజువైంది కదా.

Leave a comment

error: Content is protected !!