ప్రపంచం అంతా కీర్తించిన సినిమా ‘ సిటిజెన్ కేన్ ‘ . ఈ చిత్ర దర్శకుడు ఆర్సన్ వెల్స్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా తీసేనాటికి ఆయన వయసు కేవలం పాతికేళ్లు. ఈ సినిమాలో కెమెరా యాంగిల్స్ , స్క్రీన్ ప్లే ప్యాట్రన్ చాలా గొప్పగా ఉంటాయి. మహనటి సావిత్రి బయోగ్రఫి గా వచ్చిన ‘మహనటి’ కి ‘సిటిజెన్ కేన్‘ స్క్రీన్ ప్లే నే వాడారంటే, ఆ సినిమా ప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది తన జీవిత గాధ అని భ్రమించిన అప్పటీ మీడియా మొఘల్ విలియం రాండాల్ఫ్ హార్ట్స్, దీన్ని ఎంత బద్నాం చేయాలో అంత చేశాడు. చాల కాలం సినిమా బయటకు రాకుండా చేయగలిగాడు. అరచేత్తో సూర్యోదయాన్ని ఆపలేమన్నట్టుగా ఈ సినిమా కీర్తి ని ఎవరూ ఆపలేకపోయారు. ‘ లేడి ఫ్రం షాంగై ‘ సినిమా కూడా ఆర్సన్ వెల్స్ తీసిన గొప్ప థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి. ఇందులో ఆయనే హీరో ఆయన భార్య రీటా హేర్త్ అందులో హీరోయిన్. ‘ ది మాగ్నఫిసెంట్ అంబర్సస్ ‘ ‘ ఆర్లాడిశ్ , ‘ లివ్ ఫర్ ఫేక్ ‘ తదితర సినిమాలన్నీ ఆర్సన్ వెల్స్ ప్రతిభకు నిలువుటద్దాలు.
అర్సన్ వెల్స్ తన కెరీర్ తొలినాళ్లలో రేడియో నాటకాలు, స్టేజి నాటకాలు చేసేవాడు.మాంకోవిజ్ అక్కడే ఫ్రెండ్ అయ్యాడు. సిటిజెన్ కేన్ కి మాంకోవిజ్ స్క్రీన్ ప్లే రైటర్. కానీ క్రెడిట్ ఇవ్వలేదు. ఆర్సన్ వెల్స్ మాంకోవిజ్ ఇద్దరూ తొలినాళ్ల లో మన విజయ్ భాస్కర్ త్రివిక్రం లాగ కలిసి పనిచేసేవారు . తర్వాత విడిపోయారు
వీళ్లిద్దరి ఫ్రెండ్ షిప్, ‘ సిటిజెన్ కేన్ బ్యాక్ డ్రాప్ గురించి ఇటీవల మాంక్ అనే సినిమా వచ్చింది. .1990 ల్లోనే దీన్ని సినిమా తీద్దామని డేవిడ్ ఫించర్ వాళ్ల నాన్న అనుకున్నాడు. ఆయన చనిపోవడం తో ఇన్నేళ్ళకు తెరకెక్కింది. ఇందులో ఆర్సన్ వెల్స్ పాత్ర కూడ ఉంటుంది. ఓ రకంగా మాంకోవిజ్ సెమీ బయోపిక్ ఇది.
చాలామంది గమనించని విషయం ఏంటంటే – సిటిజెన్ కేన్ ఇన్ స్పిరేషన్ తోనే ప్రముఖ హిందీ దర్శకుడు గురుదత్ కాగజ్ కే పూల్ తీశారు. రెండూ చూస్తే పోలికలు కనిపిస్తాయి. అయితే ‘ సిటిజెన్ కేన్ మీడియా మొఘల్ కథ అయితే కాగజ్ కే పూల్ దర్శకుడి కథ లా తీశారు.
నేడు ఆర్సన్ వెల్స్ జయంతి . ఒకసారి ఆయన్ని స్మరించుకుందాం.
Writer : Pulagam Chinnarayana