లోకనాయకుడు పద్మశ్రీ కమల్ హాసన్ కెరీర్ లో మరిచిపోలేని ఒక మధురమైన నవ్వుల చిత్రం ‘మైకేల్ మదన కామ రాజు’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991 లో విడుదలై.. తెలుగునాట కలెక్షన్ల , నవ్వుల వరద పారించింది. ఎప్పుడూ ప్రయోగాలతో అభిమానుల్ని అలరించాలని తపన పడే కమల్ హాసన్ .. ఈ సినిమాలో చేసినవి ద్విపాత్రాభినయమో, త్రిపాత్రాభినయమో కాదు.. అంతకు మించి. ఏ హీరో ఎప్పుడూ కూడా చేయని బహుపాత్రల్లో అద్భుతమైన రీతిలో అభినయించి సౌత్ జనాన్ని ఉర్రూతలూగించారు. ఈ గ్రూప్ ఫోటో .. మైకేల్ మదనకామరాజు చిత్రం లోని క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలోనిది. క్లైమాక్స్ లో కొండ మీద ఒక పెట్టెలాంటి హౌస్ ఊగిసలాడుతూ ఉంటుంది. ఇందులో నలుగురు హీరోలకు సంబంధించిన గ్యాంగ్, విలన్స్ గ్యాంగ్ ఒకరికొకరు కొట్టుకుంటూంటే.. ఆ పెట్టె లాంటి ఇల్లు కదులుతూ ఉంటుంది. ఆ ఇంటి సెట్ ను చెన్నైలోని ఒక స్టూడియో లో సెట్ గా వేసి చిత్రీకరించారు. ఈ ఫోటో లో నలుగురు కమల్ హాసన్లకి ఒక్కరే దర్శన మివ్వడం ఆశ్చర్యమనిపిస్తోంది కదూ.