Double Ismart : హుషారుగా స్టెప్పులు వేస్తూ “ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే.. ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే” అని పాడుతున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం “డబుల్ ఇస్మార్ట్” లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా 2019 లో విజయవంతమైన “ఇస్మార్ట్ శంకర్” కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

“డబుల్ ఇస్మార్ట్” ని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం నుండి మొదటి పాట “స్టెప్పమార్” విడుదలైంది. “నిప్పెట్టిన పటాకే.. డబుల్ దిమాకే.. బడె బడేంకో హిలాదే.. సోచోరే” అంటూ రామ్ పాత్రను వర్ణిస్తూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. భాస్కర భట్ల సాహిత్యం రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు.

ఈ పాటలో మాస్ స్టైలిష్ లుక్ లో కనిపించిన రామ్, తన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి ఛాయాగ్రహణం వహిస్తున్నారు. “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ పోతినేని మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

 

Leave a comment

error: Content is protected !!