కరోనా వైరస్ ప్రపంచదేశాల్ని ఒణికిస్తోంది. ప్రస్తుతం భారత్ తో సహా చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. ఇది సద్దు మణిగే వరకూ ఏ బిజినెస్ కూడా సజావుగా కొనసాగదు. ముఖ్యంగా సినిమాలు థియేటర్స్ లో విడదలయ్యే యోగం ఇప్పట్లో కనిపించడం లేదు. అంతేకాదు.. లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తారనే రూమర్ కూడా బైలు దేరింది. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాలకు ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది. అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ .
ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ఫామ్పై తొలి తెలుగు చిత్రం విడుదల కానుండడం విశేషం. ఈనెల 29వ తేదీన అంటే రేపే ‘అమృతరామమ్’ అనే సినిమా జీ 5 లో విడుదల కానుంది. పద్మజ ఫిల్మ్స్ఇండియా ప్రైవేటు లిమిటెడ్ – సినిమావాలా పతాకంపై నిర్మించిన ఈ సినిమా వాస్తవంగా ఉగాది పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే అప్పటికే దేశంలో పరిస్థితులు మారిపోయాయి. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. అయితే అప్పటికే సిద్ధమైన అమృతరామమ్ సినిమా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విడుదల ఆగిపోయింది. ఈ క్రమంలో జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించినట్లు దర్శకుడు సురేందర్ కొంటాడి ప్రకటించారు.