మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని “అగ్రహారంలో అంబేద్కర్” సినిమా ఫస్ట్ లుక్ ని తెలంగాణ అధికారపక్ష ఎమ్.ఎల్.సి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా విడుదల చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్ బ్యానర్‌పై మంథా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరోగా కూడా ఆయనే నటించటం విశేషం. అంబేద్కర్ భావజాలాన్ని మరుగున పడకుండా, విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పూర్తి సహకారం అందిస్తామని దయాకర్ పేర్కొన్నారు. అలాగే, ప్రతి విద్యాసంస్థలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించాలంటూ పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ప్రముఖులు చంద్రమహేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్, రాంకి, హరి గోవింద ప్రసాద్, రాహుల్, శ్రీవికాస్, జడ్జి సురేష్, యాక్టివిస్ట్ అనిత, సినిటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమాని పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సినిటేరియా మీడియా వర్క్స్ సన్నాహాలు చేస్తుండగా, కుల, మత, ప్రాంత వైషమ్యాలకు అతీతంగా సమానతా సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషికి గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని ఎంతో ఆత్మీయంగా తెరకెక్కించామని మంథా కృష్ణచైతన్య తెలిపారు. తనను తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!