ఆయన సినిమాలు వాస్తవికతను మాత్రమే తెరపై ఆవిష్కరిస్తాయి.  సజీవమైన పాత్రలు, సహజత్వం ఉట్టిపడే సన్నివేశాలు.. ఆయన దర్శకత్వ ప్రతిభకు కొలమానాలు. బెంగాల్ లో పుట్టినా.. అన్ని ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు ఆయనకు కొట్టిన పిండే. అతి తక్కువ చిత్రాలు తెరకెక్కించినా.. ఆ సినిమాలన్నీ ఆయన్ను అవార్డులతో ముంచెత్తడం విశేషం. ఆ మహాదర్శకుడి పేరు మృణాల్ సేన్. సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటక్ ల సమకాలికుడు మృణాల్ సేన్. బెంగాలి చిత్రసీమకు లభించిన జాతిరత్నం. మార్క్సిస్టు భావాలు జీర్ణించుకున్న సంఘ సేవకుడు, గొప్ప సినీ నిర్మాత, అద్భుత దర్శకుడు. బెర్లిన్, మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు గౌరవ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన గొప్ప మేధావి.

విద్యార్థిగా వుండగానే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు మృణాల్ సేన్. తరవాత పాత్రికేయుడిగా జీవితం ప్రారంభించి కొంతకాలం కలకత్తా నగరానికి దూరంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నిర్వహించారు. సినిమారంగం మీద అభిలాష పెంచుకొని సౌండ్ టెక్నీషియన్ గా కొన్ని బెంగాలీ సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత ‘రాత్ భోరే’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు మృణాల్ సేన్. ఆయన  ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు తీసేందుకు మొగ్గుచూపేవారు. అలా ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా అవార్డులు కైవసం చేసుకొని బెంగాల్ చిత్ర సీమకే గర్వకారణంగా మారాయి. తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన ఒక వూరి కథ’ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ బహుమతి, కార్లోవివరి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జూరీ బహుమతి అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా నాలుగు సార్లు, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మూడు సార్లు జాతీయ బహుమతులు అందుకున్న మహానీయుడాయన. 1980లో ‘పద్మభూషణ్’, 2003లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు అందుకున్న మృణాల్ సేన్ జయంతి నేడు.ఈ సందర్భంగా ఆ దర్శక మేథావికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!