నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం.. అన్నారు జంధ్యాల. తన గురువు  మాటను వేదంలా  భావించి.. ఆ నానుడిని తన సినిమాలతో తెరమీద ఆవిష్కరింపచేసి నిజం చేసిన  ఎవర్ గ్రీన్ శిష్యుడు ఆయన. కల్తీ లేని కామెడీతో…నాణ్యమైన నవ్వులతో .. పొట్ట చెక్కలు చేసే హాస్యంతో .. ప్రేక్షకులకు తన సినిమాలతో మరచిపోలేని వినోదాన్ని అందించిన దర్శకుడు ఆయన. పేరు ఇ.వి.వి.సత్యనారాయణ . తొంభైల్లోనే అడ్వాన్స్ డ్ కామెడీ తో తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయించిన వినోదాల రారాజు ఆయన.

‘చెవిలోపువ్వు’తో దర్శకుడిగా మారారు ఇ.వి.వి . ఆ సినిమా విజయవంతం కాలేదు. కానీ ఆయన ప్రతిభని గుర్తించిన నిర్మాత డి.రామానాయుడు తన సంస్థలో ‘ప్రేమఖైదీ’ తీసే అవకాశాన్నిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు ఈవీవీ. ‘అప్పుల అప్పారావు’, ‘సీతారత్నంగారి అబ్బాయి’, ‘420’, ‘జంబలకిడిపంబ’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘వారసుడు’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘అబ్బాయిగారు’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘హలో బ్రదర్‌’, ‘మగరాయుడు’, ‘ఆమె’, ‘అల్లుడా మజాకా’ ఇలా వరుసగా విజయాలే. 20 యేళ్ల వ్యవధిలో 51 చిత్రాలు తీశారు. అగ్ర కథానాయకులతో పాటు.. యువతరంతోనూ సినిమాలు తీస్తూ ఇంటిల్లిపాదినీ థియేటర్‌కి రప్పించిన ఘనత ఆయనది. ఇప్పటి తరం అనుకొనే పంచ్ డైలాగులను అప్పట్లోనే తన సినిమాల్లో బస్తాల కొద్దీ కుమ్మరించిన గ్రేట్ డైరెక్టర్ ఆయన. తన గురువులాగానే టైటిల్స్ దగ్గరనుంచి శుభం కార్డ్ వరకూ తన సినిమాల్లో అడుగడుగునా వైవిధ్యతను ఆవిష్కరించిన ఇవివి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ నవ్వుల దర్శకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!