చిత్రం : ఎంత మంచివాడవురా
నటీనటులు : నందమూరి కళ్యాణరామ్, మెహ్రీన్ కౌర్ , తణికెళ్ళ భరణి, పవిత్రా కైలాష్ , నరేశ్, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, సుహాసిని, శరత్ బాబు , రాజీవ్ కనకాల, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, నారిపెద్ది, భద్రం , విజయ్ కుమార్, సుమిత్ర, అన్నపూర్ణ తదితరులు
సంగీతం : గోపీసుందర్
నిర్మాణం : ఆదిత్యా మ్యూజిక్ ప్రై లిమిటెడ్
సమర్పణ : శివలంక కృష్ణ ప్రసాద్
నిర్మాతలు : ఉమేశ్ గుప్త, సుబాష్ గుప్త
దర్శకత్వం : సతీశ్ వేగేశ్న
విడుదల తేదీ : జనవరి 15, 2020
గత ఏడాది ‘యన్టీఆర్’ సిరీస్ తో రెండు వరుస పరాజయాలు ఎదుర్కొన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత ‘118’ లాంటి థ్రిల్లర్ తో పర్వాలేదనిపించుకున్నాడు. అయినా సరే అతడి కెరీర్ ను లిఫ్ట్ చేసే ఒక మంచి సినిమా ఇంతవరకూ రాలేదు. ఆ లోటు తీర్చడానికే అన్నట్టు , ‘శతమానం భవతి’ తరహాలో ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ఈ సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’ సినిమా తో వచ్చాడు. మరి ఇలాంటి ఫ్యామిలీ కథతో ధైర్యంగా బరిలోకి దిగిన కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల్ని ఎంతవరకూ మెప్పించాడో చూద్దాం.
కథ :
చిన్నప్పుడే తల్లి దండ్రుల్ని పోగొట్టుకొని అనాథ అయిన బాలు (కళ్యాణ్ రామ్ ) బంధువుల నిరాదరణకు గురౌతాడు. దాని కారణంగా రిలేషన్స్, ఎమోషన్స్ ఎంత విలువైనవో తెలుసుకుని పెరుగుతాడు. పెద్దవాడయ్యాకా.. ఫ్రెండ్స్ కు కూడా తెలియకుండా ఒక ఊళ్ళో, ఒకో ఇంట్లో , ఒకో పేరుతో కొందరికి బంధువుగా మసలుతుంటాడు. అతడి మంచి తనాన్ని తెలుసుకొన్న ఫ్రెండ్స్ అతడితో కలిసి .. ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్స్ సప్లైర్స్ పేరుతో ఒక సంస్థను స్థాపిస్తారు. బంధువుల ప్రేమానురాగాలకు దూరమైన కొందరికి.. దాన్ని సప్లై చేయడమే వీరి పని. మరి దాన్ని వల్ల బాలు కోల్పోయిన రిలేషన్స్ ను , ఎమోషన్స్ ను ఎంతవరకూ తిరిగి తెచ్చుకున్నాడన్నదే కథ.
కథనం విశ్లేషణ :
ఇంతటి ఫ్లాట్ పాయింట్ ను రెండున్నర గంటలు ఓపిగ్గా కూర్చొని భరించడం చాలా కష్టమని బిగినింగ్ లోనే ప్రేక్షకుడికి అర్ధమైపోతుంది. అసలు డబ్బు పెట్టి ప్రేమానురాగాల్ని కొనలేరని చాలామంది దర్శకులు తమ సినిమాల్లో ఎన్నోసార్లు క్లాసులు పీకారు. అలాంటి క్లాసుల్ని ఓపిగ్గా భరించిన జనం ..ఒక సంస్థ కృత్రిమంగా కల్పించే ఎమోషన్స్ ప్రేమని అందిస్తాయని మాత్రం ఎలా కన్విన్స్ అవుతారు? ఆ చిన్న లాజిక్ ను వేగేశ్న సతీష్ లాంటి దర్శకుడు ఎలా మిస్సయ్యాడో అర్ధం కాదు. పైగా.. శర్వానంద్ లాంటి హీరోతో ‘శతమానం భవతి’ లాంటి బరువైన కథకు మంచి ట్రీట్ మెంట్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడేనా .. నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీశాడు అన్న అనుమానం కలగకమానదు.
అసలు సినిమా మొత్తంలో కథను క్యారీ చేసే బలమైన పాత్ర , బరువైన సన్నివేశమే కనిపించవు. అలాగే కథకు తగ్గ కాన్ఫ్లిక్ట్ కూడా లేకుండా పోవడంతో సినిమా మొత్తం ఫ్లాట్ గా తయారై.. సీరియల్ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుందంటే.. సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుందో అర్దమవుతుంది. తన కొడుకు ఎక్కడో అమెరికాలో ఉన్నాడని .. అతడి ప్రేమకు తాను దూరమయ్యానని ఒకడు, అమ్మమ్మని చూడాలని నా కూతురు కోరుతోందని దానికి అమ్మమ్మని చూపించాలని ఒకరు, అలాగే కేన్సర్ తో ఒక నెలరోజుల్లో చనిపోబోతున్న తన భర్తను రక్షించడానికి చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన నా కొడుకులా వచ్చి..మా ఆయనకు సంతోషం కలిగించాలని ఒకరు .. ఇలా రకరకాలుగా అతడి సంస్థకు జనం వచ్చిపోతుంటే.. చాలా సిల్లీ గా అనిపిస్తుంది.
ఇక ఇలాంటి కథలో హీరో పాత్రను ఓవర్ ది బోర్డ్ నడిపించాలని వేగేశ్న సతీశ్ బాబు ఎందుకు అనుకున్నాడో , అతడికి బిల్డప్పులు, హీరోయిజం ఎలివేషన్స్ .. పవర్ ఫుల్ డైలాగ్స్ ఎందుకు పెట్టాడో కూడా అర్ధం కావు. ఇక ఇసుక మాఫియా డాన్ గా రాజీవ్ కనకాల ను ఎస్టాబ్లిష్ చేసి.. అతడే ఈ సినిమాకి విలన్ అని .. ఆ పాత్రతోనే హీరోకి కష్టాలు కలిగించాలని దర్శకుడు ఎందుకనుకున్నాడో కూడా అర్ధంకాదు. విలన్ పాత్ర కు సరైన ఎలివేషన్ లేక, హీరోకి అతడికి సరైన కాన్ఫ్లిక్ట్ లేక ఆ ఎపిసోడ్లన్నీ చాలా చప్పగా అనిపిస్తాయి. టోటల్ గా కళ్యాణ్ రామ్ ఈ సంక్రాంతికి మిగతా సినిమాలకు ఎంతో పోటీ ఇవ్వాలని తహతహలాడి చివరికి తుస్సుమనిపించాడు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
బాలుగా కళ్యాణ్ రామ్ .. పర్వాలేదనిపించాడు. ఇక కథానాయికగా మెహ్రీన్ పాత్ర కూడా అంత గొప్పగా అనిపించదు. సినిమాలో ఏదైనా కాస్తంత రిలీఫ్ అనిపించిన పాత్ర ఏదైనా ఉందంటే.. అది వెన్నెల కిషోర్ పాత్రే. అలాగే సీనియర్ నరేశ్ పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక విలన్ గా రాజీవ్ కనకాల పాత్ర బిల్డప్పులకు మాత్రమే పరిమితమైంది తప్ప… పెర్ఫార్మెన్స్ పరంగా ఏమంతగా అనిపించదు. ఇక కేరళ ఎపిసోడ్ లో కనిపించే సుహాసిని, శరత్ బాబు పాత్రల్ని కూడా దర్శకుడు అంతగా వాడుకోలేకపోయాడు. పవిత్రా లోకేష్, తణికెళ్ల భరణి పాత్రలు కూడా ఏమంత గొప్పగా రాసుకోలేదు దర్శకుడు. అసలు గుజరాతీ రీమేక్ అని ముందే రివీల్ చేసిన జనానికి ఈ కథ గుజరాతీలో ఎందుకు ఆడిందో అసలేమాత్రం అర్ధం కాదు.
సాంకేతిక నిపుణులు :
గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఏమాత్రం ప్లస్ కాలేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. రాజ్ తోట విజువల్స్ .. కేరళ ఎపిసోడ్ లోనూ, పల్లెటూరి వాతావరణంలోనూ మెప్పిస్తాయి. ఇక ఈ సినిమాలో చాలా సన్నివేశాల్ని షార్ప్ గా ఎడిట్ చేయకపోవడం సినిమాకి మైనస్ . చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండుంటే బాగుండనిపిస్తుంది కూడా. మొత్తం మీద ఈ సంక్రాంతికి వేగేశ్న మంచి ఉద్దేశంతో సినిమా తీసినా.. కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు.
రేటింగ్ : 2
బోటమ్ లైన్ : ‘అతి’ మంచివాడవురా ….
గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే