విక్టరీ వెంకటేశ్ నటించిన కుటుంబ కథాచిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ‘దృశ్యం’. ప్రేక్షకుల్ని థ్రిల్స్ చేసే ఎన్నో అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. మీనా కథానాయికగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. అలనాటి అందాల కథానాయిక శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంది. నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, బేబీ ఎస్తేర్ అనిల్ , రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ మొదలగువారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సినీరంగంలో 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

ఈ సినిమా రాంబాబు అనే మధ్యతరగతి వ్యక్తి, తన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అరకులోని రాజవరం గ్రామంలో కేబుల్ ఆపరేటరుగా పనిచేసే రాంబాబుకి తన భార్య జ్యోతి, కూతుళ్ళు అంజు, అనులే ప్రపంచం. అనుకోకుండా వరుణ్ అనే కుర్రాడు అంజు నగ్నంగా ఉన్నప్పుడు ఒక వీడియో తీసి దాన్ని చూపించి అంజుని, జ్యోతిని బెదిరిస్తాడు. తమని తాము కాపాడుకోవడం కోసం వరుణ్ తలపై మోది గాయపరచాలనుకున్నా అతను చనిపోతాడు. విషయం తెలుసుకున్న రాంబాబు వరుణ్ తల్లి, ఇన్స్పెక్టర్ జనరల్ అయిన గీత ప్రభాకర్ నుంచి, ఇతర పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏం చేసాడన్నదే ఈ సినిమా కథాంశం. నిజానికి ఈ సినిమా మలయాళ సూపర్ హిట్టు చిత్రం దృశ్యం చిత్రానికి రీమేక్ వెర్షన్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా కేరళలో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. జీతూజోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కమల్ హాసన్ హీరోగా పాపనాశంగానూ, కన్నడలో రవిచంద్రన్ హీరోగా దృశ్యగానూ, హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా దృశ్యంగానూ రీమేక్ అయి ఆయా భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు ఇదే సినిమా సింహళ భాషలోనూ రీమేక్ అవడం విశేషం.

Leave a comment

error: Content is protected !!