మనిషి మరో మనిషిని చంపడం నేరం. అంతేకాదు; నేరం చేసిన మనిషిని చంపడం కూడా నేరమే!

ఏది నేరం? ఏది శిక్ష?

‘నేరము-శిక్ష’ అనగానే మనకు రష్యన్ మహారచయిత ఫైదోర్ దాస్టోవయస్కీ గుర్తుకు వస్తాడు. ఒకే అంశాన్ని రెండు వైపుల నుండి డీల్ చేయడంలో దాస్టోవయస్కీ గొప్ప నిపుణుడు.

మనిషి తన సమస్యలకు అపరిష్కారంగా భావించి నేరం చేస్తాడు. ఆ నేరం సమస్యను పరిష్కారించకపోగా కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. వడ్డీ వ్యాపారిని చంపితే తన పేదరికం పోతుందని రోడియన్ రాస్కోలికోవ్ నమ్ముతాడు. ఆ హత్య అతనికి ఆనందాన్ని ఇవ్వకపోగా, ఆ క్షణం నుండి మానసిక వ్యథ, నైతిక సంధిగ్ధం అతన్ని వెంటాడుతాయి. ఇది పేదరికంకన్నా పెద్ద శిక్ష.

ఇలాంటి ఒక అద్భుతమైన తాత్విక అంశంతో రచయిత దర్శకుడు జీతూ జోసెఫ్ 2013లో తీసిన సినిమా ‘దృశ్యం’.

ఒక హత్య –

ఒక నేరం –

రెండు కుటుంబాలకు శిక్ష.

రెండు కుంటుంబాలూ నేరస్తులే.

రెండు కుంటుంబాలూ బాధితులే

ఇదీ దృశ్యం సినిమా సారాంశం.

మోహన్ లాల్ ప్రోటోగోనిస్టుగా వచ్చిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. సినీ విమర్శకులు కూడ గొప్పగా మెచ్చుకున్నారు. తరువాత ఈ సినిమాను తమిళంలో కమల్ హాసన్ తో, హిందీలో అజయ్ దేవ్ గన్ తో, కన్నడలో రవిచంద్రన్ తో, తెలుగులో వెంకటేష్ తో రీ మేక్ చేశారు.

ఇప్పుడు ‘దృశ్యం’ కు సీక్వెల్ గా ‘దృశ్యం-2’ వచ్చింది. అమేజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న విడుదలయ్యింది. మొదటి సినిమా చూడకపోతే రెండవ సినిమా అర్థం కాదు. మొదటి కుటుంబం జార్జ్ కుట్టి ( మోహన్ లాల్) ఓ చిన్న పట్టణంలో లోకల్ టీవీ ఆపరేటర్. అతని భార్య రాణి జార్జ్ ( మీనా), పెద్ద కూతురు అంజూ జార్జ్ ( అంసిబా హసన్) చిన్న కూతురు అనూ జార్జ్ (ఎస్తేర్ అనిల్) వున్నదాంట్లో సంతృప్తిపడి బతుకుతున్న కుటుంబం వాళ్ళది.

రెండవ కుటుంబం గీతా ప్రభాకర్ (ఆశా శరత్) ఐజీ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ (సిద్దీఖి) ఐజి గీత భర్త వరుణ్ ప్రభాకర్ (రోషన్ బషీర్) ఐజీ కొడుకు. లేకలేక కొడుకు పుట్టడంతో తల్లి గీత, తండ్రి ప్రభాకర్ ఇద్దరూ వరుణ్ ను అతిగారాబంగా పెంచుతారు.

డబ్బు, అధికారం రెండూ పుష్కలంగా వుండడంతో వరుణ్ చెడు మార్గాలు పడతాడు. కాలేజీ స్టూడెంట్స్ నేచర్ క్యాంప్ కు వెళుతారు. అక్కడ అంజూ జార్జ్ బాత్ రూమ్ దృశ్యాల్ని వరుణ్ రహాస్యంగా వీడియో తీస్తాడు. దాన్ని అడ్డం పెట్టుకుని తన సెక్స్ కోర్కెను తీర్చమని అంజూను వేధిస్తుంటాడు. ఓ రాత్రి ఇంటికే వచ్చి ఆమెను బలవంతం చేస్తాడు. ఈ సందర్భంగా వరుణ్, అంజు, రాణిల మధ్య పెద్ద పెనుగులాట జరుగుతుంది. అందులో వరుణ్ చనిపోతాడు. అనుకోని హత్యకు భయపడిపోయిన తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి వరుణ్ శవాన్ని పూడ్చి పెట్టేస్తారు.

తన కొడుకును చంపారనే అనుమానంతో ఐజి గీత జార్జ్ కుటుంబం మీద ప్రతీకారంతో రగిలిపోతుంది. కుటుంబాన్ని కాపాడే బాధ్యతను జార్జ్ తన భుజాలకు ఎత్తుకుంటాడు. సినిమా పరిజ్ఞానంతో నకిలీ సాక్ష్యాలు సృష్టించి కేసు నుండి తప్పిస్తాడు.

కొడుకును కోల్పోయి, కేసునూ ఓడిపోవడమేగాక, అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే చెడ్డ పేరు రావడంతో ఐజి గీత మనస్తాపానికి గురవుతుంది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్ళిపోవాలనుకుంటుంది. వెళ్ళిపోయే ముందు ఐజీ దంపతులు జార్జ్ ను పిలిపిస్తారు. తమవల్ల జరిగిన తప్పుల్ని మన్నించమంటారు. ఎప్పుడయినా కొడుకు తిరిగివస్తాడని ఎదురు చూడవచ్చా అని అడుగుతారు. జార్జ్ మౌనంగా వుండిపోతాడు. కొడుకు చనిపోయినట్టు వాళ్ళు నిర్ధారించుకూంటారు. అప్పుడు జార్జ్ కూడ వాళ్ళను క్షమాపణ అడుగుతాడు. తమ ఇంట్లోకి రాకూడని అతిథి ఒకడు వచ్చాడనీ తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించాడనీ. బతిమాలినా వినలేదని. గత్యంతరంలేక మళ్ళీ తిరిగి రాకుండ అతన్ని పంపించేశామంటారు. ఐజీ దంపతుల కొడుకు శవాన్ని ఎక్కడ పూడ్చాడో భార్యకు కూడ చెప్పడు జార్జ్. నిర్మాణంలోవున్న పోలీస్ స్టేషన్ పునాదుల్లో ఆ శవాన్ని కప్పిపెట్టినట్టు ప్రేక్షకులకు సంకేతాన్ని ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.

ఆరేళ్ళ తరువాత సీక్వల్ కథ మొదలవుతుంది. అప్పటికి జార్జ్ నాలుగు డబ్బులు సంపాదిస్తాడు. పట్టణంలో సినిమా హాలు కడతాడు. ఓ సినిమా కూడ తీయాలని ఓ ప్రసిధ్ధ రచయితతో స్టోరీ సిట్టింగులు వేస్తుంటాడు. ఈ ఆరేళ్ళుగా జార్జ్ కుటుంబం కూడ సంతోషంగా ఏమీ వుండదు. భయం గుప్పెట్లో బతుకుతుంటారు. పోలీసు సైరన్ వినిపించినా, పోలీసు కనిపించినా ఉలిక్కి పడుతుంటుంది. పెద్ద కూతురికి తరచూ ఫిట్స్ వస్తుంటాయి. జార్జ్ పెరుగుదలను చూసి అసూయపడేవారు తరచూ ఆ హత్య గురించే గుసగుసలాడుతుంటారు. పోలీసులు ప్రకటించిన నగదు బహుమతికి ఆశపడిన ఓ దొంగ వరుణ్ శవాన్ని జార్జ్ పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టినట్టు చెప్పడంతో కేసును మళ్ళీ తెరుస్తారు.

మళ్ళీ జార్జ్ తన సినిమా పరిజ్ఞానంతో కుటుంబాన్ని కాపాడుకుంటాడు. కేసు నుండి తప్పుకుంటాడు. ఇంతటి ఘోరమైన నేరం జరిగినా, మనం ఇంతపెద్ద హోదాల్లో వున్నా అతన్ని శిక్షించలేకపోయాం అంటుంది మాజీ ఐజి. “ఆ కుటుంబం గత ఆరేళ్ళుగా తమ నేరం బయటపడుతుందనే భయంలో బతికింది. ఇకముందూ అలాటి భయంలోనే బతుకుతుంది. అంతకన్నా శిక్ష ఏముంటుంది వాళ్లకు?” అని కొత్త ఐజి కొత్త ఐజీ చెప్పడంతో సినిమా ముగుస్తుంది. మోహన్ లాల్ నటన పెద్ద ఎస్సెట్ అయితే రచయిత దర్శకుడు జీతూ జోసెఫ్ ట్రీట్ మెంట్ అంతకన్నా పెద్ద ఎస్సేట్ ఈ సినిమాకు. ఒక కళగా ఈ సినిమా మనసుని తాకుతుంది; ఆ పైన మెదడుకూ పనిచెపుతుంది.

 

Article –  Danny 

Leave a comment

error: Content is protected !!