చక్రల్లాంటి కళ్ళు.. చంద్రబింబం లాంటి ముఖం.. శంఖంలాంటి మెడ..  చిరునవ్వును అలంకరించే పెదవులు. ఆ చిలిపి చూపులు.. కొంటె నవ్వులు .. జడ విసురులు.. చలాకీ చేష్టలు అవన్నీ బాపూ బొమ్మకుండే లక్షణాలు. అక్షరాలా ఆ లక్షణాల్ని పుణికిపుచ్చుకొని వెండితెరపై పెళ్ళిపుస్తకం తెరిచిన కథానాయిక దివ్యవాణి. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా .. అంతగా రాని క్రేజ్ .. ఒక్క పెళ్ళిపుస్తకంతోనే తెచ్చుకొని బాపుబొమ్మల లిస్ట్ లో మంచి స్థానం సంపాదించుకుంది ఆమె.

దివ్యవాణి  అసలు పేరు ఉషారాణి. ఆమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఈమె కృష్ణ కూతురుగా నటించింది. ఆ తరువాత ఒక కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్ర దర్శకుడు ఆమె పేరును దివ్యవాణిగా మార్చాడు. ఈమె స్వగ్రామం తెనాలి. ఈమె తండ్రి ఆదినారాయణరావు, తల్లి విజయలక్ష్మి. ఈమె గుంటూరులో పదవ తరగతి వరకు చదువుకుంది. ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. సోదరి బేబీ రాణి నృత్యకళాకారిణి. చిన్నవయసులోనే అంటే 17యేళ్ళ వయసులోనే ఈమెకు దేవానంద్ అనే పారిశ్రామిక వేత్తతో వివాహం జరిగింది. దివ్యవాణి సుమారు 40 తెలుగు సినిమాలలో నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించింది. వీర మొదలైన సినిమాలలో దుష్టపాత్రలలో నటించింది. ఆపై కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. నేడు దివ్యవాణి పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!