దివ్య భారతి అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ హోదా ను దక్కించుకున్న నటి. సిని పరిశ్రమకి వచ్చిన మొదట్లోనే వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్న తర్వాత అనుకోకుండా కనుమరుగైన హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. తన పేరు వినగానే బబ్లి & చార్మింగ్ లుక్స్ గల బ్యూటిగర్ల్ గా సిని ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికి మరిచిపోలేని తీపి గుర్తుగా నిలిచిపోయిన ‘అందమైన వెన్నెల’ వంటి రూపం గుర్తుకు వస్తుంది. అందం, అభినయం, పాల బుగ్గలవంటి సోయగంతో తనదైన అల్లరితో కూడిన నటనతో అతి చిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

90వ దశకంలో కుర్రకారుల హృదయాలను ఉర్రూతలూగించింది. ఆమె అందం గురించి సిరివెన్నెల కలం ‘కన్యా కుమారి కనపడున దారి’ అని ఓ పాటలో వర్ణించారు. నిజంగానే ఆమె అందాన్ని తెరపై చూస్తున్నంత సేపు ప్రేక్షకులు మైమరిచిపోయేవారు. కేవలం 19 ఏళ్ల చిరు ప్రాయంలోనే ప్రమాదవశాత్తు మరణించింది అలా కాకుండా ఒక వేళ జీవించి ఉంటే ఆమె మరో శ్రీదేవి గా వెండితెర పై రాణించి ఉండేది.

దివ్యభారతి (ఫిబ్రవరి 25, 1974 – ఏప్రిల్ 5, 1993) ని నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం ‘బొబ్బిలి రాజా’తో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో దివ్య భారతి విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోలతో పాటు మోహన్ బాబు వంటి హీరోల సరసన నటించి అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇందులో తెలుగులో తొలి ముద్దు, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, ధర్మక్షేత్రం, తదితర చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆ తర్వాత 1992లో సినిమా విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. తెరంగేట్రం చేసి మంచి హిట్ అందుకొని ఇక్కడ కూడా బాగానే రాణించింది.

1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో సాజిద్ అనే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ రోజు అనుకోకుండా తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పిట్టగోడ నుండి జారి కిందపడి చనిపాయిందని కొందరు లేదు ఆమె ఎదుగుదలను చూడలేని వాళ్ళు చేసిన హత్యగా మరికొందరు చెప్తుంటారు. అయితే ఆమె మరణం మాత్రం అభిమానులకు ఇప్పటికి ఓ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఆ అందాల నటి దివ్య భారతి జయంతి సందర్భంగా ఆత్మీయనివాళులు అందిస్తుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!