వి.మధుసూదనరావు సొంతూరు కృష్ణాజిల్లా ఈడ్పుగల్లు.
సామాన్య రైతు కుటుంబం.
చదువు భారమయ్యే పరిస్థితి.
ఎలిమెంటరీ చదువు ఈడ్పుగల్లులోనూ… పునాదిపాడు లో హైస్కూలు చదువూ నడిచాయి. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పనిచేస్తూ తన ఫీజు తాను గడించిన వాడు మధుసూదనరావు.
1930 ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
పునాదిపాడులో ఆలిండియా స్టూడెండ్స్ ఫెడరేషన్ వారి శాఖ ప్రారంభమైనప్పుడు అందులో చేరాడు. కమ్యునిస్టు పత్రికలను రహస్యంగా పల్లెల్లో ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నాడు.
డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా స్కూలు రోజుల్లోనే ఉద్యమించాడు.
స్కూలు ఫైనల్ అయ్యాక గుంటూరు హిందూ కాలేజీలో చేరాడు.
గుంటూరులోనే కమ్యునిస్టు రాజకీయాల్లో తిరుగుతున్నాడనే ఆరోపణ మీద పోలీసులు అరెస్టు చేశారు.
బళ్లారి జైల్లో మూడు నెలల పాటు ఉండి విడుదలయ్యాడు.
నటుడు జగ్గయ్య తో కలసి జపాన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు.
చదువుకు స్వస్తి చెప్పి కృష్ణాజిల్లా ఎస్.ఎఫ్ బాద్యతలు తీసుకున్నాడు.
ఆంద్ర రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేశాడు.
అట్నుంచీ పీపుల్స్ థియేటర్ దిశగా ఆయన ప్రయాణం సాగింది.
1948 లో కోల్ కతాలో జరిగిన కమ్యునిస్ట్ పార్టీ సమావేశంలో ప్రజాసంఘాలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత అనే అంశం మీద పార్టీ లైన్ తో విబేధించి బయటకు వచ్చేశాడు.
ఫిజికల్ ట్రైనర్ గా ఉద్యోగం చేస్తూ బతికేద్దామని విజయవాడ వచ్చాడు మధుసూదనరావు.
అయితే పోలీసులు మాత్రం మధుసూదనరావును నమ్మలేదట.
అరెస్ట్ చేసి ముందు జైల్లో వేసి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు విడుదల చేశారు.
విజయవాడ లో ఉండగా ఇంగ్లీష్ ట్యూషన్లు నడిపారు.
ప్రముఖ నిర్మాతలు డూమ్డీ, మురారి ఆయన విద్యార్థులే.
ఓసారి ట్యూషన్ లో సరిగా చదవడం లేదని మురారిని కొట్టారు మధుసూదనరావు.
అది మనసులో పెట్టుకుని మొగల్రాజపురం రోడ్డు లో వెళ్తున్న మధుసూదనరావు గారి మీదకు కుక్కల్ని వదిలారు మురారి.
తర్వాత
విజయవాడలో లాభం లేదనుకుని మద్రాసు వెళ్లి అక్కడ రామకృష్ణా మిషన్ స్కూల్లో పిడిగా పనిచేశాడు.
దాదాపు ఏడాది నడిచిందా ఉద్యోగం.
కమ్యునిస్టు ఉద్యమంలో తన మిత్రులు తాతినేని ప్రకాశరావు లాంటి వాళ్లు మద్రాసు రావడంతో ప్రకాశరావు తీసిన పల్లెటూరు సినిమా లో చిన్న వేషం వేశాడు.
ఇది లాభం లేదని…
దాసి మూవీకి రంగనాథదాసు దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు.
కె.ఎస్.ప్రకాశరావు దగ్గర కన్నతల్లి, బాలానందం , అంతేకావాలి, మేలుకొలుపు చిత్రానికి పనిచేశాడు. ఆ తర్వాత జయంమనదే చిత్రానికి తాతినేని ప్రకాశరావు దగ్గర సహాయకుడుగా పనిచేశారు. అక్కినేనితో ఏర్పడిన పరిచయం వల్ల అన్నపూర్ణాలో చేరి తోడికోడళ్లు చిత్రానికి ఆదుర్తి దగ్గర పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ విరామం.
పునాదిపాడుకే చెందిన ఓ ప్రొడ్యూసరు కూతురు కాపురం సినిమా తీశారు.
ఆ మూవీకి డైరక్టరు శోభనాద్రిరావు. మధుసూదనరావు ఆయన దగ్గర పనిచేశారు. డైరక్షన్ డిపార్డ్ మెంట్ లో పొందిన అనుభవం వల్ల ఇక స్వంతంగా డైరక్షన్ చేయాలనుకున్నాడు. చదలవాడ కుటుంబరావు మరి కొందరు మిత్రులనూ పోగుచేసి సతీతులసి తీశారు.
సతీతులసి 1959లో విడుదలైంది.
ఆ తర్వాత మధుసూదనరావు దగ్గరకి జగపతీ సంస్ధ వచ్చింది.
అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు …అన్నీ శతదినోత్సవ చిత్రాలే.
దీంతో వీరమాచినేని మధుసూదనరావు కాస్తా…విక్టరీ మధుసూదనరావు అయిపోయాడు.
టాక్సీరాముడు, అప్పగింతలు సుమారుగా నడిచినా…
రక్తసంబంధం పాతిక వారాలు ఆడేసింది.
అప్పుడే విఎమ్ఆర్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
ప్రూవ్డ్ సబ్జక్టులతో వెళితే విజయం తధ్యం అనుకున్నాడు.
దాన్నే ఆచరించాడు.
పదండి ముందుకు, లక్షాధికారి, జమీందారు, డాక్టర్ ఆనంద్, లక్ష్మీ నివాసం, మంచి కుటుంబం, ఆత్మీయులు సినిమాలతో ఆయన టాప్ డైరక్టరైపోయాడు.
ఏ భాషలో కొత్త తరహా సినిమా వచ్చినా మధుసూదనరావు దాన్ని చూసి తెలుగుకు అడాప్ట్ చేసేవారు.
విన్సెంట్ చిత్రం తులాభారం మధుసూదనరావు నేతృత్వంలో మనుషులు మారాలిగా రూపొందింది. అలాగే కన్నడ సినిమా గజ్జె పూజ మధుసూదనరావు గారి చేతిలో కళ్యాణమండపంగా మారింది.
ఆయన తీసిన ఏ హిట్ మూవీ అయినా తీసుకోండి. అది ఏదో ఒక పరభాషా చిత్రానికి అనుసరణగానే రూపొందింది.
ఆయన చక్రవాకం, చండీప్రియ లాంటి నవలా చిత్రాలు కూడా తీశారు.
ఏదైనా ప్రూవ్డ్ సబ్జక్టు అయిఉండాలి.
అప్పుడే మధుసూదనరావు పట్టించుకునేవారు. ఎన్టీఆర్ తో ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు రీమేకులే.
అమానుష్ ను మధుసూదనరావు ఎదురీతగా తీసారు.
ఆయన తీసిన పౌరాణిక చిత్రం వీరాభిమన్యు . అందులో కూడా అభిమన్యుడు చనిపోయే సన్నివేశాన్ని జూలియస్ సీజర్ సినిమా తరహా లో తీస్తారు.
అలా ఆయనకు ఏదో ఒక సక్సస్ ఫుల్ ఆలంబన కావాలి.
డైలాగుతో సహా సీజర్ తరహాలోనే నడుస్తుంది. నువ్వు కూడానా కర్ణా అంటాడు అభిమన్యుడు…యూటూ బ్రూట్ తరహాలో.
ఇలా రీమేకుల మధుసూదనరావుగా పేరుపొందినా సక్సస్సుల పరంగా ఆయన సామాన్యుడు కాదు. ఆయన చివరి రోజుల్లో నాగార్జునను పరిచయం చేస్తూ విక్రమ్ తీశారు.
అదీ రీమేకే. సింహస్వప్నం అంటూ జగపతిబాబును పరిచయం చేస్తూ తీసిన సినిమా కూడా రీమేకే. కృష్ణంరాజుతో ఆయన తీసిన కృష్ణవేణి కన్నడం నుంచీ తీసుకున్నది.
అలాగే శివమెత్తిన సత్యం ఓ అమితాబ్ సినిమా ఆధారంగా తీసింది.
రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి లాంటి సక్సస్ ఫుల్ డైరక్టర్లని ఇండస్ట్రీకి ఇచ్చిన ఘనత కూడా మధుసూదనరావుకే దక్కుతుంది.
ఫిల్మ్ ఇన్స్ టిట్యూట్ అవసరాన్ని గుర్తించిన దర్శకుడు ఆయన.
మధు ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం లో ఇండస్ట్రీ కి సేవ చేయాలనే తలంపు తో పాటు…
తన ఆస్తులు కాపాడుకోవాలనే తలంపు కూడా లింక్ అయి ఉందని అంటారు.
ఏది ఏమైనా…
మధు ఫిలిం ఇన్స్ టిట్యూట్ పెట్టి విజయవంతంగా నిర్వహించారు.
చివరి వరకు సినిమా మనిషిగానే ఉన్నారు.

writer – Bharadwaja Rangavajhala

Leave a comment

error: Content is protected !!