సత్యజిత్ రే … జయంతి ఈవాళ. ఆయన మన తెలుగువారిని ఎంత కిర్రెక్కించాడంటే అతని తొలి చిత్రం ఏకంగా పన్నెండు అంతర్జాతీయ పురస్కారాలు సాధించేసింది. వాస్తవిక వాద చిత్ర నిర్మాణం అనండి … లేదూ ..పేరలల్ సినిమా ఉద్యమం అనండి వీటన్నంటికీ ఇదే ప్రేరణ. పార్ములా చిత్రాల తో సినిమాలో కళ కొడిగట్టి పోతున్న సందర్భంలో ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనీషి సత్యజిత్ రే.
సత్యజిత్ రే తర్వాత మృణాల్ సేన్ బెంగాల్ నుంచీ సవ్య సినిమా ను మరింత ముందుకు తీసుకుపోయాడు. రే కేవలం కళాజీవే … సేన్ అలా కాదు … ఆయన లో రాజకీయ నిబద్దత కూడా ఉంది. అది వారిద్దరి చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపించే తేడా … రచనలో జీవితాన్ని ఎలాగైతే ముసుగేయకుండా రాస్తామో అంత స్వచ్చంగానూ సినిమా ఉండాలని తాపత్రయపడ్డ రే … నిజంగానే భారతీయ సినిమాల మీద వెలుగు ప్రసరించిన దార్శనికుడు.
ఆయన పథేర్ పాంచాలితో ప్రారంభించి ముప్పై ఆరు సినిమాలు తీశారు. ఎన్.ఆర్ నంది సినీజనారణ్యంలో ముకుందరావ్ కాస్తా ముకుందరాయ్ గా పేరు మార్చుకుంటాను అనేంతగా తెలుగువారికి ఈర్ష కలిగించాడు రే. ముళ్లపూడి గిరీశం లెక్చర్లలోనూ సత్యజిత్ రే మీద ఆత్మీయ జోకులు వేస్తాడు. నిన్నకాక మొన్న సత్రకాయ సత్యజిత్ రే వచ్చాట్ట … అదేదో చెత్తేర్ చెదారేర్ అనేస్తాడు … నిజానికి సాక్షి చిత్ర నిర్మాణానికి ఆలోచనాత్మక గైడెన్స్ అందించింది సత్యజిత్ రేగారే. సత్యజిత్ రే కుటుంబంలోనే కళ ఉంది.
ఆయన తాతగారు రచయిత, చిత్రకారుడు, తాత్వికుడు, పుస్తక ప్రచురణ కర్త . మరి ఆ ఇన్ఫులెన్స్ సహజంగానే మనవణ్ణీ వెంటాడుతుంది కదా … అలాన్నమాట … రే కూడా చిత్రకారుడూ రచయితా ఆ తర్వాతే చలన చిత్ర దర్శకుడు. కలకత్తాలో పుట్టిన రే ప్రెసిడెన్సీ కాలేజ్ లో బిఎ ఎకనమిక్స్ చదివారు. అట్నుంచీ లలిత కళల పట్ల అభిరుచితో శాంతినికేతన్ వైపుగా అడుగులు వేశారు. అక్కడే తనలోని చిత్రకారుడికి చిత్రిక పట్టుకున్నారు. తర్వాతేదో బ్రిటిష్ అడ్వర్టైజింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.
ఇదంతా చదువుతుంటే మన బాపుగారి జీవిత చరిత్రలా అనిపించడంలేదూ …
అదే పోలికలు ఇక్కడా కనిపిస్తాయి.
అయితే రేలో విశిష్టమైన విషయం ఏమిటంటే 1947 సంవత్సరంలోనే కలకత్తా ఫిలిం సొసైటీ ఏర్పాటుకు చొరవ తీసుకోవడం … మంచి సినిమాలు రావాలంటే మంచి ప్రేక్షకులు ఉండాలి. ముందుగా ప్రేక్షకులను తర్ఫీదు చేసుకోవాలి. ఆ పని చేయాలంటే ఎక్కడికక్కడ ఫిలిం సొసైటీలు ఏర్పడి మంచి సినిమా ప్రేక్షకులంతా ఒక గ్రూపుగా ఏర్పడి మంచి సినిమాలు ప్రేక్షకులకు చూపించడంతో పాటు వాటి గురించిన విశేషాలు సామాన్య ప్రజలకు వివరించేలా చర్చా వేదికలు నిర్వహించాలి అనేది రే కాన్సెప్టు.
అది అరవైల నాటికి దేశమంతా విస్తరించింది. విజయవాడ ఫిలిం సొసైటీ , హైద్రాబాద్ ఫిలిం సొసైటీ , కరీంనగర్ ఫిలిం సొసైటీ ఇలాన్నమాట ..
ఇలా విస్తరించిన ఫిలిం సొసైటీలు దేశ వ్యాప్తంగ వివిధ భాషల్లో తయారైన మంచి సినిమాలను తీసుకువచ్చి అన్ని ప్రాంతాల వారికీ చూపించేవి. ఒక హాలు బుక్ చేసుకుని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఇంట్రస్ట్ ఉన్నవారికి ఆ సినిమాలను చూపించి వాటి మీద చర్చాగోష్టులు నిర్వహించి వాటి మీద వ్యాసాలతో చిత్ర సంస్కార లాంటి లోకల్ భాషల్లో పత్రికలు నిర్వహించి ఇలా బోల్డు పని చేశారు.
నిజంగా ఇదంతా ఒక ఉద్యమమే.
ఈ ఉద్యమానికి రూపశిల్పి సత్యజిత్ రే. ఆయన తీసిన సినిమాల ద్వారా ఆయన ఏం చెప్పాడు అనే విషయానికి వస్తే ఆయనకీ చక్రపాణికి ఉన్నటువంటి నిశ్చితాభిప్రాయాలే ఉన్నాయి. సినిమా అనేది ఒక కళారూపం. దాన్ని కాసుల కోసం చవకబారుతనంగా తయారు చేయడం తప్పు. జనాలు చూడరు అని సినిమాను దిగజార్చనక్కరలేదు. జనాన్ని కొత్త ఆలోచనల వైపుగా నడిపించడం కూడా సినిమా తీసేవాడి బాధ్యత అని చెప్పడం వరకు ఆయన ఆలోచనలు సాగాయి.
ఆ దిశగా అనేక మందిని తర్ఫీదు చేశారు. అనేక ప్రాంతాల్లో దర్శకుల్ని ప్రభావితం చేశారు. వివిధ ప్రాంతీయ భాషల్లో వాస్తవిక వాద చిత్రాలు లేదా పేరలల్ సినిమాలు తీయారు కావడానికి దోహదం చేశాడు.
ఇలా భారతదేశంలో సమాంతర సినిమా వేవ్ క్రియేట్ చేశారాయన.
ఆ బాటలో వచ్చిన దర్శకులే మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, ఆదూర్ గోపాల కృష్ణన్, భరతన్, గిరీష్ కర్నాడ్ , శంకర్ నాగ్, గౌతమ్ ఘోష్ తదాదిగా గల కొత్త తరహా చిత్ర దర్శకులు.
సేన్ ఒక ఉద్యమానికి నాయకత్వం వహించినప్పటికీ ఆయనకు చాలా స్పష్టమైన పరిమితులు ఉండేవి. ఆయన స్వచ్చమైన కళాజీవి. రాజకీయ నినాదాలు ఇవ్వడం చిత్రాల పని కాదనేది ఆయన లాంటి చాలా మంది అభిప్రాయం. నీ కళారూపం నుంచీ పొందిన జ్ఞానంతో ప్రేక్షకుడిలో ఒక రాజకీయ అభిప్రాయం కలిగితే తప్పు లేదుగానీ నీకై నువ్వు దాన్ని నినాదంగా మార్చి చెప్పకూడదు అనేది అభిప్రాయం.
చివరి వరకూ తాను నమ్మిన ఇదే సిద్దాంతం మీద నిలబడ్డారు రే. ఆయన చిత్రాల్లో అన్ని అంశాలూ ఉంటాయి. కలలు ఉంటాయి … కవ్వింతలు ఉంటాయి… మార్మికత అనిపించే అంశాలూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా వాస్తవిక దృక్కోణంలోనే ఆవిష్కృతం అవుతాయి.
ఇదే కళాజీవికి ఉండాల్సిన లక్షణం అని ఆయన నమ్మేవారు. చెప్పేవారు.
మృణాల్ సేన్ తదితరుల ధోరణి దీనికి భిన్నం. వారికి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ అభిప్రాయాల ప్రచారంలా వారి సినిమాలు అనిపించడానికీ అవకాశం కలిగిస్తూ ఆ కథలుసాగేవి.
సత్యజిత్ రే అలా కాదు …
ఆయన సినిమాలు అనేక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాయి … అసలు అంతర్జాతీయ పురస్కారాలు రావాలంటే బెంగాలీ అయిపోవాలి అనేంతగా ఇతర ప్రాంతాల వారికి కిర్రెక్కించారాయన. భారతరత్న పురస్కారం ఆయనకు లభించడం వెనుక కూడా భారతీయ సినిమాకు అంతర్జాతీయ వేదికల మీద ఆయన కల్పించిన గౌరవ ప్రతిష్టలే పన్జేశాయి.
ఫ్రెంచ్ ఫిలిం మేకర్ జీన్ రినోయర్ లాంటి అనేక మంది ప్రభావం ఆయన తీసిన సినిమాల్లో కనిపించినప్పటికీ అవన్నీ ప్రేరణలే. ఆయన సినిమాల్లో భారతీయ ఆత్మే ఆవిష్కృతం అయ్యేది. అకిరా కురసోవా అన్నట్టు రే సినిమాలు చూడలేదు అనడం అంటే తెల్లారినా సూర్యుడ్ని చూడ్లేదు అన్నట్టే … రాజకీయం మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా రే సినిమా మానవత్వాన్ని గురించి మనిషి తత్వాన్ని గురించి చాలానే మాట్లాడింది. దాన్ని అర్ధం చేసుకోగలిగితే చాలు …
రచయిత చిత్ర కారుడు చలన చిత్ర దర్శకుడు సత్యజిత్ రే భారతీయ సినిమాకు ఓ గౌరవాన్ని సాధించిపెట్టిన మహోన్నత వ్యక్తిగా ప్రతిభారతీయుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ఆయన సినిమాల గురించి మాట్లాడుకోవాలి …
ఆయన ఆశకూడా అదే … అది నెరవేరాలని ఆయన జయంతి సందర్భంగా మరోసారి కోరుకుంటూ …
Writer – Bharadwaja Rangavajhala