అప్పటి తరం ప్రేక్షకులకు వీరమాచనేని మధుసూదనరావు అంటే అర్దమయ్యేది కాదు. విక్టరీ మధుసూదనరావు అంటేనే ఆయన తెరకెక్కించిన చిత్రాలూ, ఆయన సాధించిన విజయాలూ కళ్ళ ముందు కదలాడేవి. అలాంటి ప్రతిభావంతమైన దర్శకుడు వి.మధుసూదనరావు .. ఆయన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు , ఎ.కోదండరామిరెడ్డి ల గురువు. దాదాపు అన్ని జోనర్ లోనూ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగానే కాకుండా.. అత్యధిక శాతం విజయాలందుకున్నదర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన వర్ధంతి నేడు. ‘సతీ తులసి’ పౌరాణిక చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం అయిన మధుసూదనరావు .. అప్పటి తరం హీరోలైన యన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి టాప్ హీరోలతోనే కాకుండా.. ఆ తర్వాత తరం హీరో అయిన చిరంజీవి తోనూ సినిమాలు తీశారు. ఇక ఆయనకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. అప్పట్లో ఎవరి వారసుడైనా హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే.. దర్శకుడిగా ఆప్షన్ ఒక్క మధుసూదనరావే. ఏఎన్నార్ తనయుడు నాగార్జున (విక్రమ్ చిత్రంతో ) ను,కృష్ణ తనయుడు రమేశ్ బాబు(సామ్రాట్ చిత్రంతో )ను, వి.బీ రాజేంద్రప్రసాద్ వారసుడు జగపతి బాబు (సింహ స్వప్నం చిత్రంతో ) ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆయనే అవడం విశేషం. ఇక ఈ దర్శకుడికి ఉన్నమరో ప్రత్యేకత ఏంటంటే.. ఏ భాషలో సూపర్ హిట్టు సినిమానైనా.. రీమేక్ చేసి దాన్ని హిట్టు గా మలచే గొప్ప టెక్నిక్ తెలిసిన దర్శకుడు ఆయన. అలా ఆయన రీమేక్ చేసిన చిత్రాలన్నీ దాదాపు గా విజయం సాధించాయి. అందుకే మధుసూదనరావు తెలుగు ఇండస్ట్రీలో అంతకాలం .. దర్శకుడిగా రాణించి.. అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన దర్శకుల్లో తన పేరు ను కూడా లిఖించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో విక్టరీనే తన ఇంటిపేరు గా చేసుకున్న ఆ దర్శకుడికి మూవీ వాల్యూమ్ ఘన నివాళులర్పిస్తోంది.