బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్… తన  కెరీర్ బిగినింగ్ లో నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘దిల్’. 1990, జూన్ 22న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మారుతి ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇంద్రకుమార్, అశోక్ తకేరియా సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు ఇంద్రకుమార్. అందాల మాధురీదీక్షిత్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, పద్మరాణి, సయీద్ జాఫ్రీ, దేవన్ వర్మ, సత్యేంద్రకపూర్, షమ్మి, రాజేశ్ పురి, ఆది ఇరానీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఆమిర్ ఖాన్ సూపర్ స్టార్ అవడానికి ఈ సినిమాఎంతో దోహదం చేసింది. ఇద్దరు యువతీ యువకులు ప్రేమలో పడితే.. ఇరువురి తల్లిదండ్రుల మాట పట్టింపులు, డబ్బు, అహంకారం ఏ స్థాయిలో వారిని ఇబ్బందికి గురి చేసిందో అనేదే ‘దిల్’ చిత్ర కథాంశం. ఆనంద్ మిలింద్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే సినిమాను తెలుగులో ప్రశాంత్ , దివ్యభారతి జంటగా.. ‘తొలిముద్దు’గా రీమేక్ చేశాడు దర్శకుడు రుష్యేంద్రరెడ్డి. ఆ తర్వాత ఇదే సినిమా ఒడియాలోనూ, బంగ్లా లోనూ, కన్నడలోనూ రీమేక్ అయి ఆయా భాషల్లో ఘన విజయం సాధించింది. దిల్ విడుదలై .. ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా.. ఈ సినిమా తాలూకా ప్రభావం ఇంకా తగ్గలేదు. దటీజ్ ‘దిల్’.

 

Leave a comment

error: Content is protected !!