విప్లవం ఆయన ఊపిరి. తన సినిమాలతో యువతలో చైతన్యం తీసుకొచ్చి… వారిని అభ్యుదయ బాటపట్టించడం ఆ దర్శకుడి నైజం. అన్యాయాలకు,అక్రమాలకు ఎదురుతిరిగే ధోరణి ఆయన కథాంశాల్లో చోటుచేసుకుంటుంది. అణగారిన వర్గాలకు అండగా నిలబడి.. వారి తరపున వకల్తా పుచ్చుకొని భూస్వాముల దురాగతాలకు చరమ గీతం పాడడమే ఆయన సినిమాల్లో కథానాయకుల తత్వం. ఆ దర్శకుడి పేరు ధవళ సత్యం. కుటుంబ చిత్రాలు తీసినా.. ఆ కథాంశాల్లో కూడా వామపక్ష ధోరణి కనబడుతుంది.
ధవళ సత్యం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. సినిమా దర్శకుడు కాకముందు సత్యం ప్రజానాట్యమండలి లో పనిచేసి అనేక నాటకాలను ప్రదర్శించారు, దర్శకత్వం వహించారు. జ్వాలాశిఖలు, యుగసంధి, సత్యంవధ, ఇరుసు మొదలైన నాటకాలు ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ చిత్రానికి దర్శకుడు బివీ ప్రసాద్ వద్ద అసోసియేట్ గా పనిచేయడం ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ధవళసత్యం.. ఆ తర్వాత కేఏ భీమ్ సింగ్ వద్ద ‘ఒకేకుటుంబం’ చిత్రానికి పనిచేశారు.ఆ తర్వాత ఆయన దర్శక రత్న దాసరినారాయణ రావు దగ్గర మూడు సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఆపై చిరంజీవి జాతర చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఎర్రమల్లెలు చిత్రం ఆయన్ను విప్లవ దర్శకుడిగా సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో .. మాదాల రంగారావు యువతరం కదిలింది చిత్రానికి దర్శకుడిగా మరో అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్టవడంతో .. ధవళ సత్యం దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా గుడిగంటలు మ్రోగాయి, రామాపురంలో సీత, సుబ్బారావుకు కోపం వచ్చింది, చైతన్యరథం, ఎర్రమట్టి, దొరబిడ్డ, ఇంటింటి భాగోతం, భీముడు, నేను సైతం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి.. దర్శకుడిగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. చివరగా ధవళ సత్యం లవకుశ 2డి యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.