విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్లో ‘దేవత’ ఒకటి. రేఖా అండ్ మురళీ పతాకంపై తొలి ప్రయత్నంగా హాస్య నటుడు పద్మనాభం, మరో నటుడు వల్లం నరసింహారావు సంయుక్తంగా నిర్మించిన ఈ విజయవంతమైన చిత్రానికి కె.హేమాంబరధరరావు దర్శకుడు. 1965 జూలై 24న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 55 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మహానటి సావిత్రి టైటిల్ రోల్ పోషించడమే కాకుండా.. ద్విపాత్రాభినయం కూడా చేసిన ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి.
ఆ రోజుల్లో ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడమంటే గొప్ప విషయం. ఆ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన 12 సినిమాలు విడుదలైతే, వాటిలో ఘన విజయం సాధించిన ఎనిమిదింటిలో ‘దేవత’ కూడా ఒకటి. అశేష ప్రజానీకం, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది ఈ చిత్రం. చిత్తూరు వి.నాగయ్య, పద్మనాభం, రాజనాల, వల్లం నరసింహారావు, వంగర, పెరుమాళ్ళు, బాలకృష్ణ (హాస్యనటుడు), గీతాంజలి, హేమలత, నిర్మలమ్మ లాంటి హేమాహేమీలైన నటీనటులు ఈ సినిమాకి బలంగా నిలిచారు. ఇక కథ విషయానికొస్తే…… లెక్చరర్ ప్రసాద్ (ఎన్టీఆర్) తండ్రి లోకాభిరామయ్య (నాగయ్య) శ్రీమంతుడు. ప్రసాద్ తల్లి పార్వతమ్మ (నిర్మలమ్మ) గుండెజబ్బు మనిషి. ప్రసాద్ భార్య సీత (సావిత్రి) ఆదర్శప్రాయురాలైన సద్గుణవతి. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ ఇంట్లో సీత ఒక్క క్షణం లేకున్నా గడవదు. ప్రసాద్ డాక్టరేట్ డిగ్రీ అందుకునేందుకు విశాఖపట్నం వెళ్లిన సమయంలో తండ్రి శేషయ్య (పెరుమాళ్లు)కు సుస్తీగా వుందని కబురందడంతో సీత పుట్టింటికి బయలుదేరుతుంది. అయితే సీత ప్రయాణించే రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రమాద స్థలిలో అతనికి గాయపడిన సీత పోలికలున్న లలిత (సావిత్రి ద్విపాత్రాభినయం) కనిపిస్తుంది. ఆ ప్రమాదంతో సీత మరణించిందని ఆమె సీత కాదని, పెళ్లికాని కన్య అనే నిజం తెలుసుకున్న ప్రసాద్ ఇంట్లో పరిస్థితులు చక్కబడేదాకా లలితను సీత స్థానంలో సహకరించమని కోరితే ఆమె కాదనలేక పోతుంది. ఆ తర్వాత సీత లేని లోటు తీర్చి ఆ ఇంటి ‘దేవత’గా నిలుస్తుంది.