ఆయన సహజ నటుడు… వాస్తవికతను చక్కగా ఆవిష్కరించే దర్శకుడు.. నటనలో ఉద్దండుల్ని తయారుచేసే శిక్షకుడూనూ. నాటకంలోనూ, వెండితెరమీద.. నటుడిగానూ, దర్శకుడిగానూ ప్రతిభ కనబరిచిన మేథావి ఆయన. పేరు దేవదాస్ కనకాల. నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు.
దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా పనిచేసారు. విశాఖపట్టణం లోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అయితే నాటకాల మీద మక్కువతో కొద్దిరోజుల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ సీత కథ లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా ‘చలిచీమలు, నాగమల్లి, ఓ ఇంటి భాగోతం, నిజం, పుణ్యభూమి కళ్ళు తెరిచింది’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు దేవదాస్ . నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ వద్ద రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణ్‌పాండ్యన్, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా నట శిక్షణ పొందారు. దూరదర్శన్ కోసం ఈయన దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది మొదలగు సీరియల్స్ విశేష ప్రజాదరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి. నేడు దేవదాస్ కనకాల జయంతి. ఈ సందర్భంగా ఆ అభినయ గురువుకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.