NTR – Neel combo : ఆర్.ఆర్.ఆర్ సూపర్ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి, ‘కేజీఎఫ్‌’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్‌.. ఓ సరికొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 31’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెల 9న హైదరాబాద్‌లో వైభవంగా జరగనున్నాయి.

ప్రశాంత్ నీల్‌ అంటేనే మాస్ యాక్షన్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే రకమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఎన్టీఆర్‌ ఇంతకు ముందు ఎప్పుడూ చేయని రకమైన శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాకుండా ఆయన లుక్‌ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తుండగా, భువన గౌడ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో ‘వార్ 2’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాతే ప్రశాంత్ నీల్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్‌ అండ్ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!