తెలుగు సినిమాకు వెలుగు ఆయన. ఒకే ధోరణితో ఉండే తెలుగు సినిమా శైలిని, తనదైన శైలిలో మార్చి సరికొత్తగా తీర్చిదిద్దిన మేథావి ఆయన. దర్శకత్వ శాఖకు స్టార్ డమ్ హోదా కల్పించిన  రత్నం ఆయన.  కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, పాటలు , నిర్మాణం, దర్శకత్వం అంటూ తన పేరును వేసుకొన్న మొట్టమొదటి తెలుగు దర్శకుడు ఆయన. పేరు దాసరి . ఆయనకు లేరు వేరవరు సరి. తెలుగు సినిమా కథని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు దాసరి. ఆయన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి కష్టాలే కథలు. ఈతి బాధలే కథనం. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. మా సమస్యలతో సినిమాలు తీసే దర్శకుడు అంటూ దాసరిని అభిమానించడం మొదలుపెట్టారు. సమస్యలతో సినిమా అంటే డాక్యుమెంటరీలనే ఊహిస్తాం. కానీ వాటిలోనూ తనదైన శైలిలో వాణిజ్యాంశాల్ని జోడించి సినిమాలు తీశారు దాసరి. సమాజంలో అవినీతి, మహిళలపై చిన్నచూపు, అమ్మ ప్రాధాన్యత, బంధాలు, అనుబంధాలు… ఇలా జీవితాల్లోని కోణాల్నే వెండితెరపై స్పృశించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి ఉద్ధండుల సినీ జీవితాల్ని మలుపు తిప్పేలా చిత్రాల్ని తీసిన ఘనత ఆయనది. అంతేకాదు .. అప్పటి తరం అగ్రకథానాయకులు, ఇప్పటి తరం కథానాయకుల్ని డైరెక్ట్ చేసిన ఘనత ఆనయదే. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. సినిమా నిర్మాణంతో పాటు, టెలివిజన్‌ రంగంలోనూ నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా రాణించారు.

సావిత్రి, భీమ్‌సింగ్, వేదాంతం రాఘవయ్య, కె.వి.నందనరావు, లక్ష్మీదీపక్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. భీమ్‌సింగ్‌ దగ్గర స్థిరపడ్డ సమయంలోనే ‘తాత మనవడు’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వచ్చింది. నిర్మాత కె.రాఘవ నిర్మించిన ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దాసరి నారాయణరావు పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత అవకాశాలు, విజయాలు వరుసకట్టాయి. 1973 నుంచి దర్శకుడిగా కొనసాగుతున్న ఆయన 151 చిత్రాల్ని తెరకెక్కించారు. సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించారు. మాటల రచయితగా, పాటల రచయితగా దాసరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1978లో తారక ప్రభు ఫిలింస్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. మొట్ట మొదటగా జయసుధ కథానాయికగా ‘శివరంజని’ తెరకెక్కించారు. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. 53 చిత్రాల్ని నిర్మించారాయన. నటుడిగా కూడా దాసరి చిత్ర పరిశ్రమపై తిరుగులేని ప్రభావం చూపించారు. ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘పోలీసు వెంకటస్వామి’, ‘ఆత్మ బంధువు’, ‘మామ అల్లుడు’, ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’, ‘మామగారు’, ‘రగులుతున్న భారతం’, ‘ఒసేయ్‌ రాములమ్మా’, ‘కంటే కూతుర్నే కను’, ‘మేస్త్రి’, ‘హిట్లర్‌’ తదితర చిత్రాల్లో దాసరి అత్యుత్తమ నటనని ప్రదర్శించారు. నేడు దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా ఆ దర్శక రత్నానికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

 

Leave a comment

error: Content is protected !!