ఆయన కవిత్వం అన్యాయాన్ని ప్రశ్నించింది. అక్రమాలకు ప్రతి స్పందించింది. దౌర్జన్యాలపై తిరగబడింది. దుర్మార్గాన్ని దునుమాడింది. భావప్రేరిత ప్రసంగాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన ధీశాలి ఆయన. తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు నేటికీ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఆ ధీమంతుడే ‘దాశరధి’ అని ప్రేమగా పిలిపించుకున్న దాశరథి కృష్ణమాచార్యులు. చలన చిత్రసీమలో కూడా దాశరథి తన మార్కు పాటల్ని రాసి ‘శభాష్’ అనిపించుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తి చాటిన ఆయన… సినిమా పాటల విషయంలో మాత్రం లలితమైన సాహిత్యానికి పెట్టింది పేరయ్యారు. చక్కటి భావ కవిత్వంతో పుంభావ కవీంద్రుడు అయ్యాడు.
దాశరథి కృష్ణమాచార్యుల బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. మెట్రిక్యులేషన్ పరీక్షను ఉర్దూ మీడియంలో చదివారు. తెలంగాణా విమోచనోద్యమం కారణంగా చదువు కుంటుపడడంతో 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయ సాయంకళాశాలలో చేరి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నారు. చిన్నతనం నుంచే పద్యాలు అల్లడంలో ప్రావీణ్యత సాధించారు. సంస్కృత, ఉర్దూ, పారశీక భాషల్లో దాశరథి దిట్ట. ఆ కారణంగానే ఆయన సినిమాల వైపుకు తన ప్రయాణాన్ని మళ్ళించారు. అక్కినేని ఇద్దరు మిత్రులు చిత్రంలోని ఖుషీ ఖుషీ గా నవ్వుతూ పాటతో తెలుగు తెరపై గీత రచయితగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆత్రేయ వాగ్దానం చిత్రంలో కూడా ఒక మంచి పాట రాసి.. సినీ రంగంలో స్థిరపడిపోయారు. దాశరథి రాసిన సినిమా పాటలన్నీ శ్రోతలు మెచ్చినవే. ‘తిరుమల మందిర సుందరా’ , ‘నను పాలింపగ నడచీ వచ్చితివా’, ‘శరణం నీ దివ్య చరణం’ , ‘నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో’, ‘రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా’ పాటలు దాశరథి రాసిన భక్తి పాటల్లో కొన్ని. రక్తి పాటలను కూడా దాశరథి అద్భుతంగా ఆవిష్కరించారు. వాటిలో కొన్ని ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే’, ‘వెన్నెలరేయి ఎంతో చలీ చలీ’ , ‘ఓ చెలీ కోపమా అంతలో తాపమా’, ‘విన్నవించుకోనా చిన్న కోరికా , ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’, ‘ఈవేళ నాలో ఎందుకో ఆశలు, ‘ఒక పూలబాణం తగిలింది మదిలో’, ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే’. ఇక వీణ పాటలంటే వెంటనే గుర్తుకొచ్చేది దాశరథి గీతాలే. వాటిలో కొన్ని ‘పాడెద నీ నామమే గోపాలా, ‘వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే’ , ‘నేనె రాధనోయి గోపాలా’ , ‘మ్రోగింది వీణా పదేపదే హృదయాల లోనా’, ‘మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే’. ఇలా చెప్పుకుంటూ పొతే దాశరథి రాసిని కొన్ని వందల పాటల్లో యేపాటను తీసివేయగలం. నేడు దాశరథి జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.